శంషాబాద్ రూరల్: ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణిస్తున్న వారిని స్నేహితులతో కలిసి బెదిరించి నగలు, నగదు దోచుకున్న ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రిన్సికుమార్ కొత్తూరులోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఇతడి స్నేహితులు అభిషేక్‌కుమార్, రోషన్‌కుమార్ హైదరాబాద్‌ను చూసేందుకు ఈ నెల 7వ తేదీన సొంతూరు నుంచి చెర్లపల్లికి వచ్చారు. అదేరోజు రాత్రి వీరిని తీసుకుని ఆటోలో కొత్తూరు వస్తున్నాడు. ఆటో డ్రైవర్ అబ్దుల్ యాషిన్ మార్గమధ్యలో ఈ ఆటోలో మరో ముగ్గురిని ఎక్కించుకున్నాడు. ఆటో ఘాంసిమియాగూడ వద్దకు చేరుకోగానే.. ఆటో డ్రైవర్‌తో పాటు మార్గ మధ్యలో ఆటోలో ఎక్కిన వారు ప్రిన్సికుమార్, అతడి స్నేహితులను కత్తితో బెదిరించారు. వారి వద్ద ఉన్న రూ.1,800 నగదు, రెండు వెండి గొలుసులు, రెండు ఉంగరాలతో పాటు రెండు మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. దీంతో పాటు గూగుల్‌పే ద్వారా రూ.5 వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. నిందితులైన ఆటో డ్రైవర్‌తో పాటు చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ మోసిన్, అబ్దుల్ మోసిన్, అతిఫ్‌ఖాన్‌ను అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితుల నుంచి నగలు, నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆటోను సీజ్ చేశారు.


