● ‘రేడియల్’ భూ బాధితుల ఆవేదన
● తహసీల్దార్ గోవిందమ్మకు వినతిపత్రం అందజేత
దోమ: రేడియల్ రింగ్ రోడ్డు కోసం సాగు భూములను లాక్కోరాదని భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని ఖమ్మం నాచారం, పాలేపల్లి గ్రామాల్లో రేడియల్ రింగ్ రోడ్డు కోసం జరుగుతున్న సర్వేను తహసీల్దార్ గోవిందమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రేడియల్ రింగ్ రోడ్డు కారణంగా తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. సాగుకు అనుకూలమైన భూములను తీసుకోవడం సరికాదన్నారు. సర్వే అధికారులు భూములు కోల్పోతున్న రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు లాక్కుంటున్నారని తెలిపారు. ఇది సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆత్మహత్యలే శరణ్యం
ప్రకృతి వైపరీత్యాలు, అడవి జంతువుల బెడద ఉన్నా ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు ఖమ్మం నాచారం, పాలేపల్లి గ్రామాల రైతులు తెలిపారు. రేడియల్ రింగు రోడ్డు కారణంగా జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కొద్దిపాటి భూమిని ప్రభుత్వం లాక్కుంటే ఏం చేసి బతకాలని ప్రశ్నించారు. ఆత్మహత్యలే శరణ్యం అని అన్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా
రైతుల బాధలు విన్న తహసీల్దార్ గోవిందమ్మ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


