అనంతగిరి: హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నేడు(ఆదివారం) జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం నుంచి భారీ నిధులు వస్తున్నట్లు తెలిపారు. రైల్వే, రోడ్లు, పలు అభివృద్ధి పనులకు పెద్ద పీట వేస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారం చేపట్టి అజేయ శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు. నేడు అన్ని వర్గాల ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవరెడ్డి, శివరాజు, రమేష్‌కుమార్, మిట్ట పరమేశ్వర్, పాండుగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, అసెంబ్లీ కోర్డినేటర్ వడ్ల నందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్, సీనియర్ నాయకులు మల్లేశం, నరోత్తంరెడ్డి, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి


