షాద్‌నగర్: వికసిత్ భారత్ సాధనే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత అందె బాబయ్య అన్నారు. ఈ నెల 10న ప్రధాని మోదీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పెయింటింగ్స్‌ను శనివారం పట్టణంలో బీజేపీ నాయకులు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, గ్రామాలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసేందుకు మోదీ హైదరాబాద్ విచ్చేస్తున్నారని, ఈ సందర్భంగా పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.


