అమ్మ మనసు చల్లన | - | Sakshi
Sakshi News home page

అమ్మ మనసు చల్లన

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

బొంరాస్‌పేట: అసలే మూఢ నమ్మకాలను బాగానమ్మే గిరిజన తెగ. చదువు, విజ్ఞానం లేని రెండు దశాబ్దాల క్రితం జన్యులోపం కారణంగా ఆతండాలోని ఓ తల్లి రెండు చేతులు లేని మగ బిడ్డకు జన్మనిచ్చింది. ‘తొలి కాన్పులో మురిపాల కొడుకునిస్తుందని కలలుకంటే పిశాచిని కన్నది’.. అంటూ పచ్చి బాలింతను పశువుల కొట్టంలోకి తరలించి, కళ్లు తెరవని పసిగుడ్డుకు పాలివ్వొద్దని హుకుం జారీ చేశారు. ఆతల్లికి అన్నం కాదు కదా.. తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఇంతటి విపత్కర పరిస్థితులను సైతం తట్టుకుని, పేగు తెంచుకు పుట్టిన తన బిడ్డను బతికించుకుంది. ఎవరూ చూడని సమయంలో, రాత్రి వేళల్లో బాబుకు పాలిచ్చింది. తాను అర్ధాకలితో అలమటిస్తూనే కన్న కొడుకును కాపాడుకుంది. ఇలా అమ్మ ఇచ్చిన జన్మ, పునర్‌జన్మతో పెరిగి పెద్దయిన కొడుకు నేడు కలెక్టర్‌ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ తల్లి కలలను సాకారం చేస్తున్నాడు. మాతృదినోత్సవం సందర్భంగా సాక్షి కథనం..

అరిష్టమని గెంటేసినా..

బాపల్లితండాకు చెందిన శీలాబాయి దినసరి కూలీ. భర్త మంగ్యానాయక్‌ ముంబై వలస కూలీ. 2004లో వీరికి రెండు చేతులు లేకుండా బాబు పుట్టాడు. పుట్టింది పసిబిడ్డ కాదని, పిశాచి అని, ఇది కుటుంబానికి అరిష్టమని తల్లీబిడ్డను ఇంట్లోనుంచి గెంటేసి, పశువుల కొట్టంలో ఉంచారు. బిడ్డకు పాలివ్వకూడదని ఆదేశించారు. కొద్ది నెలల తర్వాత ఓసంస్థ ప్రమేయంతో తల్లీకొడుకుకు ఇంట్లో స్థానం దక్కింది. బాబుకు శ్రీకార్‌ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇతని తర్వాత నర్సింగ్‌, తారాసింగ్‌కు జన్మనిచ్చింది. పుట్టుకతోనే చేతులు లేని శ్రీకార్‌ను రెండో తరగతి వరకు తుంకిమెట్లలో, ఆతర్వాత పదో తరగతి వరకు బొంరాస్‌పేట ప్రభుత్వ పాఠశాలలో చదివించింది. ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన ఆయువకుడు ప్రస్తుతం కలెక్టరేట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన నర్సింగ్‌ పోలీస్‌ ఉద్యోగానికి కోచింగ్‌ తీసుకుంటుండగా, తారాసింగ్‌ విదేశాల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

సీఎం చొరవతో..

శ్రీకార్‌ కాళ్లతో రాయడం, కంప్యూటర్‌ విద్య నేర్చుకోవడం వంటి అంశాలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లగా ఏడాదిన్నర క్రితం కలెక్టరేట్‌ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పించారు. అప్పటి నుంచి అమ్మకు, కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. తన తల్లికి జన్మంతా రుణపడి ఉంటానని చెబుతున్నాడు. తన ముగ్గురు కొడుకులే తనకు సర్వస్వమని చెబుతోంది సుశీలాబాయి.

అందరూ వద్దన్నా..

బిడ్డను కాపాడుకున్న తల్లి

వేధింపులను తట్టుకుని నిలిచి,

గెలిచిన ఆదర్శమూర్తి

నేడు మాతృదినోత్సవం

Advertisement
 
Advertisement
Advertisement