బీఆర్‌ఎస్‌వి నీచ రాజకీయాలు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌వి నీచ రాజకీయాలు

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజారెడ్డి

తాండూరు: నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పేరు ప్రతిష్టలు తగ్గించేందుకు బీఆర్‌ఎస్‌ నీచరాజకీయాలకు పాల్పడుతోందని తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి ఆరోపించారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీఆర్‌ఎస్‌ నాయకులు కోర్టు కేసులు పెడుతున్నారన్నారు. మున్సిపల్‌ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఇచ్చి గెలిపించారన్నారు. ఇది జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్‌ నాయకులు గొడవలు సృష్టించేందుకు యత్నించారని ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు తారుమారు చేయడానికి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రయత్నం చేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం అర్ధరహితమన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిపై పట్టణ పీఎస్‌లో కేసు నమోదు కావడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు అల్ప సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే అది చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు చోటా మోటా నాయకులు మద్యం, డ్రగ్స్‌ మత్తులో ఎన్నికల అధికారులపై పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించాకే కౌటింగ్‌ కేంద్రం వద్దకు వచ్చారని గుర్తు చేశారు. సౌమ్యుడైన ఎమ్మెల్యేపై బీఆర్‌ఎస్‌ నాయకులు అక్రమ కేసులు పెట్టారన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన చివరకు న్యాయం గెలుస్తోందన్నారు. తరచూ ఏదో ఒక కేసులో కోర్టుల చుట్టు తిరిగే వారికి రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన తాండూరు నియోజవకర్గ అభివృద్ధి నచ్చడం లేదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ మండలాల అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, రాజ్‌కుమార్‌, రాజవర్ధన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రజాక్‌, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు హబీబ్‌లాల, తాండూరు మండల మాజీ అధ్యక్షుడు జన్నె నాగప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement