దేవదేవుని ఆదేశంతోనే.. | - | Sakshi
Sakshi News home page

దేవదేవుని ఆదేశంతోనే..

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

ఈ జన్మకు వచ్చిన గొప్ప అవకాశం ఇది 2027 డిసెంబర్‌ లోపుపనులు పూర్తి కావాలి అభివృద్ధే లక్ష్యంగాప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి

శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం

కొడంగల్‌: దేవదేవుని ఆదేశం మేరకు కొడంగల్‌లో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ జన్మకు వచ్చిన గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి 2027 డిసెంబర్‌లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్‌నవీకరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.110 కోట్ల వ్యయంతో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. తిరుమల తరహాలో నాలుగు మాఢ వీధులు, పుష్కరిణి, అన్న దాన సత్రం, కల్యాణ మండపం, ధ్వజ స్తంభం, ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, క్యూలైన్‌, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, పార్కింగ్‌, ప్రసాద కౌంటర్ల నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. తిరుమల నుంచి వచ్చిన అర్చకులు వైదిక కార్యక్రమాలను వైఖానస ఆగమ శాస్త్రోకంగా నిర్వహించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన యాగశాలలో హోమం తదితర పూజలు నిర్వహించారు. ఉదయం కుంభారాధన, చతుర్వేద శిలలకు అభిషేకం, హోమాలు, పుర్ణాహుతి జరిపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన) కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దుద్యాల్‌ మండలం లగచర్లలో 430 పడకల ఆస్పత్రికి, కోస్గిలో వేణుగోపాల స్వామి ఆలయానికి, దౌల్తాబాద్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఇక్కడే శిలాఫలకాలకు పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 55 ఏండ్ల క్రితం నందారం కుటుంబీకులు నిర్మించిన కొడంగల్‌ ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తిరుమలకు వెళ్లి వచ్చిన పుణ్యం వస్తుందన్నారు. శ్రీవారి ఆలయానికి ఎంతో సేవ చేసిన టీటీడీ వైఖానస ఆగమ శాస్త్ర సలహాదారులు, దివంగత సుందర వరధ భట్టాచార్యుల పేరును ఏదో ఒక ప్రాంగణానికి పెట్టాలని అధికారులకు సూచించారు. గడి గుడి ఏకమై కొడంగల్‌ను నందనవనంగా తీర్చిదిద్దాలన్నారు. పట్టణంలో ఇక గ్రూపులకు.. గుంపులకు తావులేదన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసమే పని చేయాలన్నారు. కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యేలు నందారం వెంకటయ్య, నందారం సూర్యనారాయణలు ఈ గుడి కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. వారి ఆశయాలను అమలు చేయాల్సిన తరుణం వచ్చిందన్నారు. తిరుమల తరహాలో నిత్య పూజలు, కైంకర్యాలు జరుగుతున్నాయని చెప్పారు. నారాయణపేట ఎత్తిపోతల పథకం, కృష్ణా – వికారాబాద్‌ రైల్వేలైన్‌, కొడంగల్‌ మండలంలో సిమెంట్‌ ఫ్యాక్టరీ పనులకు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కొడంగల్‌కు మెడికల్‌, వృత్తి విద్య, ఇంజనీరింగ్‌, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారా మెడికల్‌ కళాశాలలు, స్కిల్‌ యూనివర్సిటీ, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళా శాల, జూనియర్‌ కళాశాలలు మంజూరు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, బుయ్యని మనోహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యారు, కలెక్టర్‌ దీపక్‌ తివారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement