అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
వికారాబాద్: ప్రభుత్వ ఆదేశాలను జిల్లా మైనింగ్ అఽధికారులు బేఖాతరు చేస్తున్నారు. సర్కారు కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో ఉండరాదనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. మూడు నెలల క్రితం అద్దె భవనాలను ఖాళీ చేసి సొంత బిల్లింగ్‌లలో ఆఫీసులను మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని మైనింగ్ ఏడీ కార్యాలయం మాత్రం తాండూరులోని చిన్నపాటి వాహనం కూడా వెళ్లడానికి వీలులేని వీధిలో ఓ అద్దె ఇంట్లో కొనసాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా ఉన్న సమయంలో తాండూరు ప్రాంతంలో ఎక్కువ మైన్స్ ఉన్నాయనే కారణంతో అక్కడ ఆ శాఖ ఏడీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వికారాబాద్ కొత్త జిల్లాగా ఏర్పాటై ఎనిమిదేళ్లు అవుతోంది. అన్ని హెచ్‌ఓడీల కార్యాలయాలను కలెక్టరేట్‌కు మార్చారు. మైనింగ్ కార్యాలయం మాత్రం తాండూరులోనే ఉండిపోయింది. ఏ చిన్న పని పడినా ఆ శాఖ కిందిస్థాయి అధికారులు, కాంట్రాక్టర్లు తాండూరుకు వెళ్లాల్సి వస్తోంది. తరచూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే ఆ శాఖ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కార్యాలయాన్ని కలెక్టరేట్‌కు మార్చలేదనే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వ ఖజానాకు గండి
ఇటీవలి కాలంలో మైనింగ్ శాఖ అధికారుల తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక, నాపరాయి, సుద్ద, గ్రానైట్, ల్యాట్రేట్ తదితర ఉత్పత్తుల తవ్వకాలు, రవాణా విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి. లీజు తీసుకున్న ప్రాంతంతోపాటు పక్కనున్న ఏరియాలో కూడా తవ్వకాలు జరపడం, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడటం వంటి ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఓవర్ లోడ్‌తోనే ఖనిజాలు రవాణా అవుతున్నాయి. 30 టన్నుల సామర్థ్యం ఉన్న లారీలో 50 నుంచి 60 టన్నులు తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రోజుకు సగటున రెండు నుంచి మూడు వేల టన్నుల ఐరన్ ఖనిజాన్ని తరలిస్తుంటారు. టన్నుకు రూ.279.50 ప్రభుత్వానికి చెల్లించాలి. ఇందులో డీఎంఎఫ్టీ నిధుల కింద జిల్లాకు టన్నుకు రూ.36 చొప్పున జమ చేస్తారు. ఓవర్‌లోడ్ కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ 50 శాతమే వస్తోంది. మిగతా సగం మైనింగ్ యజమానుల జేబుల్లోకే వెళ్తోంది. ఎప్పుడో ఒకసారి అధికారులు ఒకటి అర కేసులు, ఫైన్లు వేసి చేతులు దులుపుకొంటున్నారు.
తాండూరులోనే మైనింగ్ ఏడీ కార్యాలయం
చిన్నపాటి అద్దె భవనంలో నిర్వహణ
సొంత బిల్డింగ్‌లో ఉండాలన్న నిబంధన బేఖాతరు
తరచూ అవినీతి ఆరోపణలు
తాజాగా ఏడీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
మైనింగ్ శాఖ అధికారులపై అనేక ఆరోపణలు రావడం.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం లాంటి విషయాలు కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో మైనింగ్ ఏడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్, ఇసుక వ్యాపారులు పేట్రేగి పోతుంటే, ఓవర్ లోడ్‌తో వాహనాలు వెళ్తుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించారు. అక్రమార్కులను వెంటనే కట్టడి చేయాలని కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు. ఓ పక్క ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా.. ప్రజల నుంచి విమర్శలు వెళ్లువెత్తుతున్నా వారి తీరు మాత్రం మారడంలేదు. మూడేళ్ల క్రితం నూతన కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు మైనింగ్ శాఖ ఏడీ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ ఇంజనీర్ల కార్యాలయాలు మాత్రం బయటే కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ కార్యాలయాలు జిల్లా కేంద్రం వికారాబాద్‌లోని ఓ మూలన కొనసాగుతుండగా మైనింగ్ కార్యాలయం మాత్రం తాండూరులోనే ఉండిపోయింది.


