పని చేయకుండానే పైసలు డ్రా! | - | Sakshi
Sakshi News home page

పని చేయకుండానే పైసలు డ్రా!

May 8 2026 1:13 PM | Updated on May 8 2026 1:13 PM

బయట పడిన అధికారుల బండారం

హడావుడిగా ఎండిన చెట్ల తొలగింపు

ధారూరు: పనులు చేయకుండానే పైసలు డ్రా చేశారన్నా ఫిర్యాదు నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన విచారణ ముగిసింది. విచారణలో నిధుల స్వాహ నిజమేనని తేలింది!. దీంతో తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఆ అవినీతి అధికారులు హడావుడిగా పనులు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.

విచారణ అధికారికి బుజ్జగింపు

ఫారెస్టు రేంజ్‌ పరిధి రాస్నం సెక్షన్‌ మూడు గ్రామాల్లో అప్రూటల్‌ (అటవీ ప్రాంతంలో ఎండిన చెట్లను వేర్లతో సహా తొలగించి కాల్చివేయడం) పనులు చేయకుండానే చేసినట్లు రికార్డులు చూపి, రూ.7 లక్షలు డ్రా చేశారన్న ఫిర్యాదు నేపథ్యంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు ఆఫీసర్‌ సువర్ణ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. దీంతో బుధవారం ధారూరు ఫారెస్టు రేంజ్‌ పరిధిలోని రాస్నం, సంగాయపల్లి, దోర్నాల్‌ ఫారెస్టు బీట్లలో విజిలెన్స్‌ డీఎఫ్‌ఓ ముకుంద్‌రెడ్డి (విజెలెన్స్‌) బృందం.. అక్కడ బాధ్యత వహిస్తున్న ఇద్దరు అధికారులపై విచారణ పూర్తి చేసింది. ఇందులో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. విషయం బయట పడటంతో ఆ అధికారులు గురువారం అప్రూటల్‌ పనులు ప్రారంభించారు. ఈ అవి నీతి అధికారులను కాపాడేందుకు మరో అధికారి విచారణ అధికారులను మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్‌ అధికారుల విచారణ నివేదికను వారిద్దరికి అనుకూలంగా వచ్చేవిధంగా చూడాలని విచారణ అధికారిని బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అవినీతి అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement