జిల్లాలో ఉద్యాన పంటల సాగు పెంచే దిశగా చర్యలు
వికారాబాద్: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉన్న మన జిల్లాలో ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఆ శాఖ అధికారులు సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు. హైదరాబాద్ వాసుల కూరగాయల అవసరాలను చుట్టుపక్కల జిల్లాల రైతులు 50 శాతం కూడా తీర్చలేకపోతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, మొదక్, సంగారెడ్డి జిల్లాల్లో 50 శాతంలోపే పండిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన 50 శాతం కూరగాయలపే పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి నగరానికి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తద్వారా రైతుల ఆదాయం పెంచాలని భావిస్తోంది.
సాగు విస్తీర్ణం రెండింతలయ్యేలా..
ఇతర జిల్లాలతో పోలిస్తే కూరగాయల సాగుకు అనువైన, సారవంతమైన భూములు మన జిల్లాలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏటా ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచి సమీప భవిషత్తులో రెండింతలు చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా యంత్ర పరికరాలను 50 నుంచి 100 శాతం రాయితీపై అందించాలని నిర్ణయించారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి గాను రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించటం ప్రారంభించారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లా రైతాంగం దశాబ్ద కాలంగా ఉద్యాన పంటలైన కూరగాయలు, పూలు, పండ్ల తోటల పెంపకంపై మొగ్గుచూపుతోంది. ప్రస్తుతం 49,495 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతుండగా ఇందులో 15,265 ఎకరాల్లో పండ్ల తోటలు.. 27,125 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు. మరో 6,254 ఎకరాల్లో పసుపు, అల్లం, 851 ఎకరాల్లో పూల తోటలు సాగుచేస్తున్నారు.
రాయితీ పరికరాలు
డ్రిప్: పెద్ద రైతులకు 70 శాతం రాయితీపై డ్రిప్ పరికరాలు ఇవ్వనున్నారు. మిగతా 30 శాతం తోపాటు జీఎస్టీని రైతులు భరించాల్సి ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం రాయితీపై డ్రిప్ పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్ప్రింక్లర్లు: అన్ని వర్గాల రైతులకు 65 శాతం రాయితీతో స్ప్రింక్లర్లు ఇవ్వాలని నిర్ణయించారు. గరిష్టంగా రెండున్నర ఎకరాలు ఉన్న రైతులకు రాయితీ వర్తిస్తుంది.
పందిళ్లు: అర ఎకరం ఒక యూనిట్ చొప్పున రాయితీ వర్తిస్తుంది. మొత్తం ఖర్చులో 50 వేల రూపాయలను ప్రభుత్వం రాయితీ రూపంలో అందిస్తుంది. ప్రతి రైతులకూ అమలు చేస్తారు.
నారు కోసం: టమాటా, వంకాయ, క్యాప్సికం, మిరప తదితర కూరగాయ పంటల నారును ప్రభుత్వం అందించనుంది. రెండున్నర ఎకరాల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది.
నీటి గుంటలు: రైతులు పొలాల్లో నీటి గుంటలు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించనుంది. గుంతలకు ప్లాస్టిక్ లైనింగ్ ఏర్పాటుకు 50 రాయితీ ఇవ్వనుంది.
ఉల్లి సాగుకు: ఉల్లి, పూల తోటల సాగుకు ఉద్యానవన శాఖ ఆర్థిక సాయం అందిస్తుంది. ఎకరాకు రూ. 8వేలు సాగు సాయం చేస్తుంది.
మల్చింగ్: ప్లాస్టిక్ మల్చింగ్ పేపర్ల కొనుగోలుకు రూ.50 శాతం రాయితీ ఇస్తుంది. రెండున్నర ఎకరాల వరకు వర్తిస్తుంది.
థైవాన్ స్ప్రేయర్లు: ఏ కంపెనీకి చెందిన స్ప్రేయర్ కావాలో రైతులు ఎంచుకుని అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి.. వాటికి అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ ఇస్తారు.
మినీ ట్రాక్టర్: 20 హెచ్‌పీలోపు మినీ ట్రాక్టర్లకు దాదాపు రూ.లక్ష వరకు రాయితీ అందిస్తుంది. టమాటా, మామిడి కాయల రవాణాకు వినియోగించే ప్లాస్టిక్ ట్రేలను 50 శాతం రాయితీపై అందిస్తారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు 90 శాతం రాయితీతో మొక్కలు, నాలుగు సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు, అంతర పంటల సాగుకు ఎకరానికి రూ.4,200 చొప్పున ఇస్తారు. పొలాల చుట్టు నాటుకునే వెదురు మొక్కలను కూడా రాయితీపై సరఫరా చేస్తారు.
80 నుంచి 100 శాతం రాయితీతో స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాలు
పండ్లు, పూలు, కూరగాయల సాగుకు వర్తించేలా..
2026 – 27 ఆర్థిక సంవత్సరానికి గాను దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలో పండ్ల తోటల సాగు విస్తీర్ణం 15,265 ఎకరాలు
కూరగాయలు 27,125 ఎకరాల్లో
సుగంధ ద్రవ్యాలు 6,254 ఎకరాల్లో
పూల తోటలు 851 ఎకరాల్లో
దరఖాస్తు చేసుకోండి
ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అవసరమైన పరికరాలను రాయితీపై అందిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం నియెజకవర్గ స్థాయి అధికారుల వద్ద ఫారాలు అందుబాటులో ఉన్నాయి. రాయితీ పొందాలనుకునే రైతులు పట్టా పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేయాలి. డ్రిప్ పరికరాల కోసం మీసేవా ద్వారా.. మిగతా వాటి కోసం నేరుగా ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి.
– సర్దార్, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి


