జీవో ఎప్పుడు..?
ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటై 14 నెలలు
సాంకేతికంగా ఇంకా వేరుపడని వైనం
ఒకే పీఎస్.. రెండు స్టేషన్‌ల కేసులు
ప్రభుత్వ జీఓ విడుదలైతే పూర్తిస్థాయి ఠాణాగా ఏర్పాటు
శంషాబాద్: ఏటా పెరుగుతున్న ప్రయాణికులు.. మరోవైపు విమానాశ్రయ విస్తరణ.. ఎయిర్‌పోర్ట్ అనుబంధ పరిశ్రమలు.. ప్రయాణికులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇలా ప్రతిరోజు లక్షకు పైగా జనాభాతో కిక్కిరిసిపోయే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శాంతిభద్రతలతో పాటు నేరాల నియంత్రణ కోసం ఎయిర్‌పోర్ట్‌లోనే గతేడాది మార్చి 1 ఆర్‌జీఐఏ పోలీస్ ఔట్‌పోస్టు స్టేషన్‌ను అప్పటి సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రారంభించారు. పద్నాలుగు మాసాలుగా పోలీస్‌స్టేషన్ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నా దానికి పూర్తి స్థాయిలో పోలీస్‌స్టేషన్‌గా సాంకేతికంగా ఇంకా అనుమతి లభించలేదు. దీనికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో విడుదల కావాల్సి ఉంది.
2008లోఆర్‌జీఐఏగా..
2008 మార్చిలో 23 శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. 2008 అక్టోబర్‌లో శంషాబాద్ పట్టణ కేంద్రంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీస్‌స్టేషన్ పేరుతో భౌగోళికంగా ఎయిర్‌పోర్ట్‌తో పాటు శంషాబాద్ పట్టణం, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్‌పహాడ్ రెవున్యూ ప్రాంతాన్ని కలిపి ప్రారంభించారు. విమానాశ్రయంలో వీఐపీల రాకపోకల బందోబస్తుతో పాటు నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు, ఫేక్ సర్టిఫికెట్‌లు, ప్రమాదాలు ఇతరత్రా అనేక కేసులతో దర్యాప్తుతో పాటు పట్ణణానికి సంబంధించిన కేసుల దర్యాప్తు కూడా ఇక్కడే కొనసాగింది.
గత నాలుగేళ్లుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణతో పాటు ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం కూడా రెట్టింప్పు అయ్యింది. దీనికి తోడు విమానాశ్రయంలో ఎరోసిటీ, అనేక ప్రత్యేక సెజ్‌లుగా ఏర్పాటు కావడంతో వివిధ రకాల కేసులు కూడా పెరుగుతువచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌లో జరిగే ప్రతి చిన్న సంఘటనకు బాధితులు శంషాబాద్ పట్టణానికి చేరుకుని ఫిర్యాదు చేయడం భారంగా మారడంతో పోలీసులు కూడా ఉరుకులు.. పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు మొగ్గుచూపి గతేడాది మిస్‌వరల్డ్ పోటీలకు ముందు ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించింది.
జీవో వస్తే..
బాధితుల నుంచి వెంటనే ఫిర్యాదులు స్వీకరించినా పట్టణంలో ఉన్న పోలీస్‌స్టేషన్ ద్వారానే నేటికి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. రెండు పోలీస్‌స్టేషన్‌ల కేసులు ఒకే పోలీస్‌స్టేషన్ సీరియల్ నంబర్‌లో కొనసాగుతున్నాయి. దీంతో సాంకేతికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. జీవో వస్తే సిబ్బంది సంఖ్య పెరిగితే పోలీసుల సేవలు కూడా మెరుగుపడే అవకాశముంది.
మరిన్ని మార్పులు..
గతంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న శంషాబాద్ డీసీపీ జోన్ ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి మారింది. ప్రస్తుతం పట్టణంలో ఉన్న ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ శంషాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం హైదారాబాద్ నగరపాలక సంస్థలో ఉన్న అనేక ప్రాంతాలు కూడా ఇంకా శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నాయి. శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉంది. ఆర్‌జీఐఏ పోలీస్ ఔట్‌పోస్టు స్టేషన్‌కు జీవోతో పాటు, శంషాబాద్‌టౌన్‌గా ఏర్పాటు కానున్న ప్రస్తుత ఆర్‌జీఐఏ స్టేషన్‌కు భౌగోళిక మార్పుల కోసం పోలీసు అధికారులు కూడా ఎదురుచూస్తున్నారు.


