● బాలుడి గల్లంతు
● సహాయ చర్యలు చేపట్టిన పోలీసులు
దౌల్తాబాద్: ఈత కోసం వెళ్లిన బాలుడు బావిలో మునిగి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మండల పరిధి చంద్రకల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తగుట్టుతండాకు చెందిన రమేష్, లక్ష్మిబాయి దంపతుల కుమారుడు ఈశ్వర్(13), దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామంలోని మెథడిస్టు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతూ ఇక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం పుణె వెళ్లారు. చంద్రకల్ గ్రామం పక్కనే సందపూర్‌తండాకు చెందిన బాలుడి పెదనాన్న ఇక్కడ చదివిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం పాఠశాలకు ఒంటిపూట కావడంతో మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి పాఠశాల పక్కనే ఉన్న బావిలో ఈత కొట్టడానికి వెళ్లారు. ఈశ్వర్ ఓ ప్లాస్టిక్ డబ్బా కట్టుకొని బావిలోకి దిగడంతో లోతు ఎక్కువగా ఉండి మునిగిపోయాడు. భయపడిన మిగతా ముగ్గురు విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. వారు వచ్చి చూసే వరకు బాలుడు ఆచూకీ తెలియలేదు.
సహాయక ముమ్మరం
విషయం తెలుసుకున్న కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ వేణుకుమార్ సంఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా ట్రాక్టర్ల ఇంజన్ల ద్వారా నీటిని బయటకు తోడటానికి ప్రయత్నించారు. రెస్క్యూటీంను రప్పించారు. రాత్రి 8గంటల వరకు బాలుడి అచూకీ లభ్యం కాలేదు. గజ ఈతగాళ్లను రప్పించే యత్నం చేస్తున్నారు.
పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ జిల్లా నాయకుడు మొగులప్ప డిమాండ్ చేశారు. మధ్యాహ్నం బాలుడు బావిలో మునిగిపోతే.. ఘటనా స్థలంలో పాఠశాల యాజమాన్యం లేకపోవాడన్ని తప్పుపట్టారు. బాలుడి స్వగ్రామం మహబూబ్‌నగర్ నినియోజకవర్గం కావడంతో అక్కడి ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాదం గురించి ఆరా తీశారు. కలెక్టరు, స్థానిక తహసీల్దారుతో మాట్లాడారు. సహాయ చర్యలు ముమ్మరం చేసి, బాలున్ని వెలికితీయాలని కోరారు.


