● అనుమతి ఓ చోట..
తరలింపు మరో చోటికి
● చోద్యం చూస్తున్న అధికారులు
ఈ ఫొటోలో కనిపిస్తున్న తాండూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ట్రాక్టర్. మండలంలోని కరన్‌కోట్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు మంజుల పేరిట ఇసుక పర్మిట్ పొందారు. బుధవారం పాత తాండూరులోని ఇసుక రీచ్ నుంచి కరన్‌కోట్ గ్రామానికి లోడు వెళ్లాల్సి ఉంది. కానీ చెన్‌గేస్‌పూర్ గ్రామ శివారులోని ఓ ఫాంహౌస్‌కు ఇసుక తరలించారు. గ్రామస్తులు ట్రాక్టర్‌ను అడ్డుకొని కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తాండూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక దందా జోరుగా సాగుతోంది. అనుమతి తీసుకున్న చోటికి కాకుండా మరో చోటికి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని చెన్‌గేస్‌పూర్, కరన్‌కోట్, వీరారెడ్డిపల్లి, మల్కాపూర్, అంతారం, కొత్లాపూర్, బెల్కటూర్, జినుగుర్తి గ్రామాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో ఇసుక పర్మిషన్ తీసుకోవాలి. ఇందు కోసం రూ.428 చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి వచ్చిన పత్రాలు చూపి ట్రాక్టర్ ఇసుకను రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. లబ్ధిదారులకు రెండు ట్రిప్పుల ఇసుక తోలి ఆ తర్వాత పదుల సంఖ్యలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రాక్టర్ యజమానులు, కొందరు నాయకులు ఇసుక మాఫియాగా ఏర్పాడ్డారు.
చర్యలు తీసుకుంటాం
ఇందిరమ్మ ఇంటి పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతులు ఇస్తున్నాం. ఒకచోటికి వెళ్లాల్సిన ఇసుకను మరో చోటికి తరలిస్తే ట్రాక్టర్ యజమానులపై కేసులు నమోదు చేస్తాం. భారీ జరిమానా విధిస్తాం.
– తారాసింగ్, తహసీల్దార్, తాండూరు


