శంకర్‌పల్లి: ట్రాక్టర్ బోల్తా పడి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన సోమవారం శంకర్‌పల్లిలో చోటుచేసుకుంది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని సింగపూర్ టవర్‌కి చెందిన మల్లేశ్ (50) రెండేళ్లుగా మున్సిపల్ కార్యాలయంలో రోజువారి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాధిరిగానే మల్లేశ్ సోమవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేశాడు. శంకర్‌పల్లికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వచ్చాడు. మున్సిపల్ ట్రాక్టర్ తీసుకొని అతివేగం, అజాగ్రత్తగా వెళ్తుండగా.. డంపింగ్ యార్డు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. మల్లేశ్ కింద పడగా ట్రాక్టర్ ట్రాలీ వెనుక టైరు మల్లేశ్‌పైకి ఎక్కింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


