అక్రమార్కులతో దాగుడుమూతలు! | - | Sakshi
Sakshi News home page

అక్రమార్కులతో దాగుడుమూతలు!

Mar 26 2026 10:57 AM | Updated on Mar 26 2026 10:57 AM

బషీరాబాద్‌ పోలీసుల పనితీరుపై సర్వత్రా విమర్శలు

ఖాకీల కనుసన్నల్లోనే

ఇసుక మాఫియా ఆగడాలు

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన

వ్యక్తులపై చర్యలు శూన్యం

కేసు నమోదు చేసి

చేతులు దులుపుకొన్న వైనం

బషీరాబాద్‌: జిల్లా సరిహద్దు మండలమైన బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. పలుమార్లు ఉన్నతాధికారులు హెచ్చరించినా ఇక్క డి పోలీసుల వ్యవహార శైలి మారడం లేదు. మండలంలోని ఇసుక అక్రమ రవాణాదారులతో వీరు కొనసాగిస్తున్న ‘మామూలు’ బంధం వారిపైనే దాడులకు దారితీస్తోంది. తాజాగా రెండు ఇసుక ట్రాక్టర్లు డిపార్ట్‌మెంట్‌ కారులో పెట్రోలింగ్‌ చేస్తున్న ఎస్‌ఐ వాహనాన్ని ఢీ కొట్టిన ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. రెండు రోజులు గడిచినా సదరు ట్రాక్టర్‌ డ్రైవర్లను గుర్తించకపోవడం పోలీసుల పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది.

ముఠాగా ఏర్పడి..

మండలంలో ఇసుక, ఎర్ర మట్టి వనరులు విరివిగా ఉన్నాయి. వీటిని కొల్లగొట్టేందుకు కొంతమంది ట్రాక్టర్ల యజమానులు ముఠాగా ఏర్పడ్డారు. ఠాణా ఎస్‌హెచ్‌ఓలుగా ఎవరు వచ్చినా.. పోలీసులకు మామూళ్లు ఇస్తూ అక్రమ రవాణా సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం దామర్‌చెడ్‌, నంద్యానాయక్‌తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తూ ఎస్‌ఐ శ్రీశైలంయాదవ్‌కు తారసపడ్డారు. ఈ సమయంలో పోలీసులు వాహనాన్ని అడ్డంగా పెట్టగా ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా డ్రైవర్లను పట్టుకోలేదు. ఓ ట్రాక్టర్‌ యజమాని అయిన శ్రీనివాస్‌ అనే వ్యక్తిని మంగళవారం సాయంత్రం పీఎస్‌కు పిలిపించి, జామీనుపై వదిలేశారు. అతని ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ట్రాక్టర్‌ నడిపిన దామర్‌చెడ్‌వాసి ద్యావరి శ్రీనివాస్‌ గ్రామంలోనే దర్జాగా తిరగడం పోలీసుల పనితీరుపై విమర్శలకు తావిస్తోంది.

‘ఖాకీ’లపై అవినీతి మరకలు

ఈ నెల 16న బషీరాబాద్‌ కొత్త ఎస్‌ఐగా శ్రీశైలం యాదవ్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని మొదటిరోజే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. సదరు వ్యక్తులను పిలిపించి, గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. అక్రమ రవాణా చేస్తే తోలు తీస్తా అంటూ హెచ్చరించారు. తీరా నాలుగు రోజుల క్రితం నావంద్గీ ఇసుక రీచ్‌ వద్ద రాత్రి వేళ తొమ్మిది ట్రాక్టర్లను పట్టుకున్న సదరు సారుగారూ అక్రమార్కులను వదిలేయడంపై పోలీసువర్గాల్లో అంతర్గత చర్చజరిగింది. ఈ విషయంలో పెద్ద మొత్తంలో డీల్‌ కుదిరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

● ఎక్మారయి గ్రామంలో ఇసుక రవాణా చేసే వారిపై పోలీసు వాహనంతో వెంబడించారు. తీరా కొంత మంది ఇసుక వ్యాపారులు వచ్చి సారుతో మాట్లాడి వెళ్లాక ఇటువైపు కూడా చూడడంలేదని స్థానిక యువకులు చెబుతున్నారు.

● స్టేషన్‌లోనూ సిబ్బందితో భేటీ అయిన ఎస్‌ఐ గబ్బర్‌సింగ్‌ సినిమాలో మాదిరిగా వారికి కూడా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఠాణాలో ఏం జరిగినా మీడియాకు, ఉన్నతాధికారులకు చేరవేస్తే సస్పెండ్‌ చేయిస్తానని హెచ్చరించినట్లు ఓ కానిస్టేబుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

● విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సారు.. నేను చెప్పిందే మీరు రాయాలి. ఏదిపడితే అది రాస్తే లీగల్‌ నోటీసులు పంపిస్తా. కేసులు పెట్టాల్సి వస్తది జాగ్రత్త అంటూ వచ్చీరాగానే బెదిరింపులకు దిగడం మీడియా ప్రతినిధులను విస్తుపోయేలా చేసింది. ఎస్‌ఐపై వస్తున్న ఆరోపణలపై వివరణ అడగగా సమాధానం దాటవేశారు. ఏదైనా రాస్తే చూసుకుంటానని బెదిరింపు ధోరణిలో మాట్లాడటం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement