● డీపీఓకు ఫిర్యాదు చేసిన రాకొండ సర్పంచ్
● పంచాయతీ నిధులు
పక్కదారి పట్టించారని వెల్లడి
దోమ: పంచాయతీ నిధులు పక్కదారి పట్టడంపై స్థానిక సర్పంచ్ అధికారులకు ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడం చర్చనీయాంశమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని రాకొండ పంచాయతీ కార్యదర్శి రవికుమార్ 15వ ఆర్థిక సంఘం నిధులు 1,15,025, ఉపాధి హామీ నిధులు రూ.1,20,000 ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఇది గమనించిన సర్పంచ్ మశ్చేందర్‌రెడ్డి సెక్రటరీని అడగగా, పొంతన లేని సమాధాలు చెప్పారు. దీంతో చేసేదేమీలేక ఎంపీడీఓ గ్యామకు ఫిర్యాదు చేశారు. రోజులు గడుస్తున్నా ఈవిషయంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో గురువారం డీపీఓ జయసుధను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యదర్శి పనితీరు, నిధుల మళ్లింపు అంశాలను వివరించారు. కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, సెక్రటరీ రవికుమార్ గతంలో ఇళ్ల అనుమతులకు, బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.
నివేదిక పంపాం
రాకొండ కార్యదర్శి రవికుమార్‌పై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గ్రామంలో విచారణ జరిపాం. నివేదికను జిల్లా అధికారులకు పంపించాం. వారి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటాం.
– గ్యామా, ఎంపీడీఓ, దోమ


