బంకుల వద్ద భారీ క్యూలు డబ్బాలు, క్యాన్లతో వాహనదారులు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం బ్లాక్ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్లు రెండింతలు చేసి విక్రయిస్తున్న వైనం
వికారాబాద్: పెట్రోల్, డీజిల్ కొరత వదంతుల నేపథ్యంలో వాహనదారులు బంకులకు క్యూ కట్టారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. బైకులు, కార్లు, లారీలు, స్కూల్ బస్సులతో బంకులు కిక్కిరిసి పోయాయి. అత్యవసరంగా పెట్రోల్, డీజిల్ కావాల్సిన వారు గంటల తరబడి క్యూలో ఇరుక్కుపోయారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రి వరకు ఇదే పరిస్థితి కనిపించింది. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో మొత్తం 72 పెట్రోల్ బంకులు ఉండగా అన్నింటా రద్దీ కనిపించింది. సాధారణంగా వంద రూపాయల పెట్రోల్ కొట్టించుకునే వారు ముందు జాగ్రత్తగా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. రూ.500 నుంచి రూ.1,000 పెట్రోల్ పోయించుకునే కార్ల యజమానులు రెండు నుంచి మూడు వేల రూపాయల పెట్రోల్ వేయించుకుంటున్నారు. లారీలు, స్కూల్ బస్సులు సైతం క్యూ కట్టడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. వెరసి రోజు మొత్తం 700 నుంచి 1,000 లీటర్లు అమ్ముడయ్యే బంకుల్లో 5,000 లీటర్లు దాటి విక్రయిస్తున్నారు. ఐదు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక ట్యాంకర్ వస్తే రెండు నుంచి ఐదు రోజులపాటు విక్రయించే వారు.. ప్రస్తుతం ఒకే రోజులో అయిపోవడం కొరతకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్లు
వారం పది రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఎక్కువ మంది సిలిండర్లు బుక్ చేస్తుండటంతో సమస్య తలెత్తుతోంది. సకాలంలో పంపిణీ చేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సిలిండర్ పంపిణీ చేసిన తేదీ నాటి నుంచి 25 రోజుల తర్వాతే మళ్లీ బుక్ చేసుకునే నిబంధన పెట్టారు. ఇదిలా ఉండగా ఒక్కో సిలిండర్‌కు ఎజెన్సీల నిర్వాహకులు రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. వారం రోజులుగా కమర్షియల్ సిలిండర్లు రావడంలేదు. డెమెస్టిక్ సిలిండర్‌ను బ్లాక్ మార్కెట్‌లో రూ.2,400కు విక్రయిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్‌ను రూ.2,150 విక్రయించాల్సి ఉండగా రూ.3,500 నుంచి రూ.4,000 వరకు తీసుకుంటున్నారు. చాలా మంది హోటల్, కరీ పాయింట్ యజమానులు కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. కొందరు హోటళ్లను మూసివేశారు. జొన్నరొట్టెలు విక్రయించేవారు ఉపాధి కోల్పోతున్నారు.
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 2,08,553
జిల్లాలో మొత్తం 2,08,553 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెల్ల రేషన్ కార్డు కలిగిన 1,16,990 మందికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం వర్తిస్తోంది. డబుల్ సిలిండర్ కనెక్షన్లు 19,358, సింగల్ సిలిండర్ కనెక్షన్ 69,902 ఉన్నాయి. కమర్షియల్ 3,209, దీపం పథకం కనెక్షన్లు 35,193 ఉన్నాయి. వీటితో పాటు ఉజ్వల్ పథకం కింద 38,753, సీఎస్‌ఆర్ కింద 21,260 కనెక్షన్లు ఉన్నాయి. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దొరకక వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
కొరత లేదు: ఆయిల్ కంపనీల యాజమాన్యం
ఇంధనం కొరత ఉందనేది కేవలం వదంతులు మాత్రమే. ప్రస్తుతం ఎలాంటి కొరత లేదు. ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారు. అన్ని కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయి. క్యాన్లు, డబ్బాల్లో పెట్రోల్ తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం. అందరూ సహకరించాలని ఆయిల్ కంపెనీ యాజమాన్యం కోరింది.
వదంతులు నమ్మొద్దు
ఎస్పీ స్నేహమెహ్ర
అనంతగిరి: పెట్రోల్, డీజిల్ సరఫరాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్నేహ మెహ్ర బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందరాదని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మి ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లరాదన్నారు. ఇలాంటి చర్యల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు. అవసరం మేరకు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా నిల్వ చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ప్రజలు సంయమనం పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
కొరతా.. కృత్రిమ సృష్టా అనే అనుమానం
జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 2,08,553
కమర్షియల్ 3,209
పెట్రోల్ బంకులు 72


