అనంతగిరి: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రగతి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరితో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 2 నుంచి వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సభలు ఏర్పాటు చేసి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయం, సన్న బియ్యం బోనస్, రైతు భరోసా, రైతు బీమా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, వైద్యం, గర్భిణులు, చిన్నారులకు పోషకాహారంపై చర్చించారు. సమావేశంలో ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్‌ఓ శ్రీనివాస్, సీపీఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలి
నవాబుపేట: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. బుధవారం మండలంలోని ఆదర్శ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయం, ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నాడు. ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించాలని, సందేహాలు ఉంటే ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత కేశవపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించి అంచనాలు సమర్పించాలని తెలిపారు. మహిళా సమాఖ్య భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, పీఆర్ డీఈ మాధవరెడ్డి, ఏఈ ప్రణీత్, ఎంఈఓ అబ్దుల్ రెహమాన్, ప్రిన్సిపాల్ కృష్ణకుమార్, పీహెచ్‌సీ వైద్యుడు రోహిత్‌కుమార్, సర్పంచ్‌లు బల్వంత్‌రెడ్డి, నరసింహారెడ్డి, మాణి క్యం పాల్గొన్నారు.


