జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం
తాండూరు: పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం అన్నారు. బుధవారం జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై కిసాన్ మేళా, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పలు కంపెనీలు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను శాస్త్రవేత్తలు రాజా, మధుశేఖర్, టీ.రాజేశ్వర్‌రెడ్డి, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్‌చార్జ్ సుధారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత వ్యవసాయ విద్యపై ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు. పత్తి సాగుకు తేలికపాటి నేలలు అనుకూలమన్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు యంత్రాలను ఉపయోగించాలని సూచించారు. తద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయన్నారు. ఎరువుల వాడకం, నీటి యాజమాన్య పద్ధతులను వివరించారు. పత్తిలో వేరుకుళ్లు, ఎండు తెగులు, ఆకుమచ్చ వంటి తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకోవాని సూచించారు.


