పరిగి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు సర్కార్‌ను 420 ప్రభుత్వం అని అంటున్నారని తెలిపారు. పింఛన్లు పెంచుతామని, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పటికి మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా.. ఎందులోనూ ఆ ప్రస్తావన తేలేదని విమర్శించారు. చెప్పిన వాటిలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తప్ప.. మరేది పూర్తిగా అమలు చేయలేదన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 వేల కోట్లు 30శాతం మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకొందన్నారు. మొన్నటి 2026–27 బడ్జెట్ ప్రజావ్యతిరేకంగా ఉందన్నారు.
రెండున్నరేళ్లలో లక్షల కోట్ల అప్పు
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే.. కేవలం రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ రూ.3.47 లక్షల కోట్ల అప్పు చేసిందని మహేశ్‌రెడ్డి తెలిపారు. ఐదు లక్షల కోట్ల అప్పుతో కాళేశ్వరం, రైతు రుణమాఫీ ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు కేసీఆర్ అందించారని వివరించారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అనతి కాలంలోనే అన్ని లక్షలు కోట్లను ఎందుకు అప్పు చేసిందో వారి దగ్గరే సరైన సమాధానం లేదని మండిపడ్డారు.
ఎక్కడ అభివృద్ధి చేశారు?
తమ హయాంలో పరిగి మున్సిపల్‌కు రూ.25 కోట్లు తీసుకువస్తే.. ఇప్పటి వరకు వాటి పనులు నిర్వహించపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలో రూ.60 వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెబుతున్న ఎమ్మెల్యే.. ఎక్కడెక్కడ చేశారో చెప్పాలన్నారు. జిల్లా నుంచి సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి.. కేవలం కొడంగల్‌కు మాత్రమే నిధులు ఇస్తున్నారని విమర్శించారు. జిల్లా మొత్తానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్‌కుమార్, మాజీ ఎంపీపీ అరవింద్‌రావు, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, కౌన్సిలర్లు రవికుమార్, శ్రీనివాస్, తాహేర్‌అలీ, నరేష్, బలాల, సామ్యనాయక్ పాల్గొన్నారు.
30శాతం రుణమాఫీతో చేతులు దులుపుకొన్న సర్కార్
ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్
మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
ప్రజావ్యతిరేక బడ్జెట్ అంటూ మండిపాటు


