ఘనంగా పోచమ్మ బోనాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పోచమ్మ బోనాలు

Mar 23 2026 10:08 AM | Updated on Mar 23 2026 10:08 AM

మొయినాబాద్‌: మున్సిపల్‌ పరిధిలోని చిన్నషాపూర్‌లో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. భవానీ మాత, పోచమ్మ దేవాలయాల మూడో వార్షికోత్సవం అంగరంగ వైభవంగా చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా డప్పు చప్పుళ్లు, బ్యాండు భాజాలతో బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి పోచమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించా రు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అదుపుతప్పి ప్రహరీని ఢీకొట్టిన బైక్‌

మొయినాబాద్‌: బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ప్రహరీని ఢీకొట్టడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపై మొయినాబాద్‌లోని గండిపేట చౌరస్తా సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండలం నార్సింగికి చెందిన వల్లబొద్దు విజయ్‌కుమార్‌(54) నగరంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో వార్డ్‌ బాయ్‌గా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం మొదటి భార్య మరణించడంతో మొయినాబాద్‌ మండలం అమ్డాపూర్‌కు చెందిన కర్పూరను రెండో పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లుగా అమ్డాపూర్‌లోనే ఉంటూ ఉద్యోగానికి వెళ్తున్నారు. కాగా ఆదివారం సెలవు కావడంతో బైక్‌పై నార్సింగికు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి అమ్డాపూర్‌కు వెళ్తుండగా హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపై గండిపేట చౌరస్తా సమీపంలోని వీఆర్‌కే కళాశాల వద్దకు చేరుకోగానే బైక్‌ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ప్రహరీని ఢీకొట్టింది. దీంతో విజయ్‌కుమార్‌ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

రోడ్డుకు మరమ్మతులు

మొయినాబాద్‌: మున్సిపల్‌ 9వ వార్డు జీవన్‌గూడలో అధ్వానంగా మారిన రోడ్డుకు కౌన్సిలర్‌ ముదిగొండ ప్రభాకర్‌ మరమ్మతులు చేయించారు. జీవన్‌గూడలో రెండు నెలల క్రితం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. పైపులు వేసేందుకు గాను కాలనీలో రోడ్డును తవ్వారు. కానీ పనులు పూర్తయిన తరువాత మట్టితో గుంతలు పూడ్చి చదును చేయకుండా అలాగే వదిలేశారు. కాగా నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మట్టి కొట్టుకుపోయి రోడ్డు గుంతలమయంగా మారడంతో గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆదివారం 9వ వార్డు కౌన్సిలర్‌ ముదిగొండ ప్రభాకర్‌ దగ్గరుండి మొరం పోయించి గుంతలు పూడ్చివేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement