● మధ్యాహ్నం అయినా.. విధులకు రాని ఏఓ, ఏఈఓలు
● రైతుభరోసా దరఖాస్తు కోసం పడిగాపులు
బషీరాబాద్: అధికారుల నిర్లక్ష్యం.. అన్నదాతలకు శాపంగా మారింది. ’కొత్తగా పాసుపుస్తకాలు పొందిన వారు రైతు భరోసాకు అర్హులు. ఈ నెల 25వ తేదీ వరకు వ్యవసాయ విస్తరణ అధికారులను రైతులు సంప్రదించి, దరఖాస్తు చేసుకోవాలి’ అన్న ప్రభుత్వ ప్రకటనతో రైతులు రైతు వేదికల వద్ద నిరీక్షిస్తుండగా.. వ్యవసాయ అధికారులు నిర్యక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా విధులకు హాజరు కాకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. శుక్రవారం బషీరాబాద్, కాశీంపూర్ కేంద్రాల వద్ద ఇదే జరిగింది. పెట్టుబడి సాయం దరఖాస్తుకు ఆయా కేంద్రాలకు రైతులు ఉదయం 9 గంటలకు రాగా.. అధికారులు మధ్యాహ్నం వరకు రాలేదు. మండల కేంద్రంలోని రైతువేదికకు తాళం వేసి ఉండడంతో.. 12 గంటల వరకు అక్కడే వేచి చూశారు. ఫోన్లు చేసినా ఏఓ అనిత, ఏఈఓలు లిఫ్ట్ చేయలేదని పలువురు రైతులు ఆరోపించారు. భరోసా దరఖాస్తుకు గడువు సమీపిస్తుందని, అధికారులు సమయ పాలన పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. తామంతా ఇలా రైతు వేదికల వద్ద బారులు తీరగా.. 12.30 గంటల తర్వాత వచ్చి, తిరిగి 3 గంటలకే వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయమై ఏఓను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ చేయగా.. అధికారి స్పందించలేదు.


