● కొడంగల్‌లో ఒకే వైకుంఠధామం
● హిందూ శ్మశాన వాటిక లేక ఇబ్బందులు
కొడంగల్: మున్సిపల్ పరిధిలో మెజారిటీ వర్గాలకు వైకుంఠ ధామాలు, శ్మశాన వాటికలు లేవు. 2003లో అప్పటి ఎంపీ జితేందర్‌రెడ్డి నిధులతో పట్టణ శివారులో నిర్మించిన వైకుంఠధామం ఒక్కటే ఉంది. సమాజంలో కొన్ని కులాలకు చెందిన వారు పార్థివ దేహాలను దహనం చేస్తారు. మరి కొందరు ఖననం చేస్తారు. ఇలా రెండు రకాలుగా ఆఖరి మజిలీని ముగిస్తారు. కొడంగల్ టౌన్‌లో సుమారు 10వేలకు పైగా జనాభా ఉంది. ఇందులో హిందువులు, ముస్లింలు ఎవరి మత ఆచారం ప్రకారం వారు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ముస్లింలకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో శ్మశాన వాటికలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలో ఎలాంటి సౌకర్యాలు లేవు. దహన సంస్కారాలు చేసిన తర్వాత కాళ్లు చేతులు కడుక్కోడానికి నీటి సౌకర్యం కూడా లేదు. కొడంగల్ మున్సిపల్ పరిధిలో 12 వార్డులు ఉన్నాయి. కొడంగల్, కొండారెడ్డిపల్లి, ఐనన్‌పల్లి, బూల్కాపూర్, పాత కొడంగల్, పాత కొడంగల్ తండా, గుండ్లకుంట గ్రామాలను మున్సిపాలిటీలో కలిపారు. సుమారు 18 వేల జనాభా ఉంది. అయినా శ్మశానాలకు స్థలాలు లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.


