రియల్‌ మాయ! | - | Sakshi
Sakshi News home page

రియల్‌ మాయ!

Mar 9 2026 9:28 AM | Updated on Mar 9 2026 9:28 AM

ఫాం లేఅవుట్స్‌కు ప్రహరీలు

వికారాబాద్‌: వెంచర్లకు అనుమతులు, అక్రమ నిర్మాణాల విషయంలో రియల్టర్లు నిబంధనలు తుంగలో తొక్కుతుండగా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. విమర్శలు, ఆరోపణలు వస్తే నామమాత్రపు చర్యలు, నోటీసులతో సరిపెడుతున్నారు. ఫిర్యాదులు అందిన సమయంలో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారనే అపవాదు ఉంది. రియల్టర్లకు అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అక్రమ లేఅవుట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు రైతులు, వారికి మేలు చేసే చట్టాల ముసుగులో ఫాం లేఅవుట్లు ఏర్పాటు చేస్తూ నాలా కన్వర్షన్‌ చేయకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల చెరువులు, నాలాలు సైతం కబ్జా చేస్తున్నారు. ఫాం లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా.. కట్టడి చేయాల్సిన రెవెన్యూ, పంచాయతీ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అటుగా కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

గజాల్లో విక్రయం.. గుంటల్లో రిజిస్ట్రేషన్‌

వ్వవసాయ భూములను ప్లాట్లు చేయాలన్నా.. గజాల్లో విక్రయించాలన్నా.. ముందుగా ఆ భూమికి సంబంధించి నిర్దేశిత రుసుము చెల్లించాలి. అనంతరం వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్‌ చేసుకోవాలి. ఆ తరువాత ఆ భూములు వ్యవసాయ భూముల నుంచి కమర్షియల్‌ పర్పస్‌ ల్యాండ్‌గా మారుతుంది. కాగా వ్యవసాయ యోగ్యంగా లేని భూములు మాత్రమే నాలా కన్వర్షన్‌ చేయాలనే నిబంధన కూడా ఉంది. ఇవన్నీ పట్టించుకోని అక్రమార్కులు నాలా కన్వర్షన్‌ చేయకుండానే గజాల్లో విక్రయిస్తూ గుంటల చొప్పున రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. భూమిని నాలా చేయకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న వ్యవసాయ భూముల్లో బీటీ రోడ్డు, సీసీ రోడ్డు వేయడానికి అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా వేస్తున్నారు. నాలా కన్వర్షన్‌ చేయకుండా.. ప్రభుత్వ రుసుము చెల్లించకుండానే వ్యవసాయ భూములు లేఅవుట్‌గా మార్చి విక్రయిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులు కొత్త దందాకు తెరలేపారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేస్తున్నారు. గజాల చొప్పున విక్రయిస్తూ గుంటల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే బీటీ, సీసీ రోడ్లు నిర్మించి కొనుగోలుదారులకు అంటగడుతున్నారు.

పుట్టగొడుగుల్లా ఫాం లేఅవుట్స్‌

అనుమతులు లేకుండా బీటీ, సీసీ రోడ్లు

నాలా కన్వర్షన్‌ చేయకుండానే ప్లాట్ల విక్రయాలు

నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్‌ల నిర్మాణం

మిన్నకుంటున్న రెవెన్యూ, పంచాయతీ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

ప్రభుత్వాదాయానికి భారీగా గండి

అవకతవకలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. అవకతవకలకు పాల్పడుతున్న రియల్టర్లతో అధికార యంత్రాంగం సైతం కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పంచాయతీలతో పాటు, మున్సిపల్‌ పరిధిలోనూ ఫాం హౌస్‌ల పేరుతో పంచాయతీల అనుమతులు సైతం లేకుండా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవటంలేదు. మరికొన్ని చోట్ల వ్యవసాయ భూమిని ఫాం లే అవుట్ల పేరుతో అభివృద్ధి చేసి ఐదు, పది గుంటలు, అర ఎకరం చొప్పున విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ తతంగం కొనసాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని కొత్రెపల్లి సమీపంలో సుమారు పదెకరాలకు పైగా ఫాం లేఅవుట్లు చేశారు. మర్పల్లి మండలం తుమ్మలపల్లిలో, పరిగి మండలంలో, వికారాబాద్‌, నవాబుపేట, మోమిన్‌పేట, పూడూరు తదితర చోట్ల ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. వికారాబాద్‌ మండల పరిధిలోని ద్యాచారం గ్రామంలో 20 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిలో రోడ్లు నిర్మించారు. ప్రహరీ ఏర్పాటు చేసి ఫాం లేఅవుట్‌గా అభివృద్ధి చేశారు. మండల పరిధిలోని పీరంపల్లి, సిద్దులూరు గ్రామాల పరిధిలో సైతం 130 ఎకరాల్లో ఇలాంటి ఫాంలేఅవుట్లే చేసి గజాల చొప్పున విక్రయిస్తూ గుంటల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement