వివాదాల విద్యాశాఖ
నాడు వద్దని..
నేడు కావాలని..
వికారాబాద్: రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆరుగురు ఎంఈఓలను ఒకే సారి బాధ్యతల నుంచి తప్పించడం వివాదంగా మారింది. మూడు రోజులుగా విద్యాశాఖలో ఈ అంశం చర్చనీయాంశమైంది. జోనల్ పోస్టుకు మండల సీనియారిటీ చూడటంపై విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం పని చేస్తున్న వారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. విద్యాశాఖలో దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం నాన్చుతూ వస్తోంది. రెగ్యులర్ ఎంఈఓలు లేక విద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీన్ని గాడిలో పెట్టేందుకు మూడేళ్ల క్రితం ఎంఎన్‌ఓ(మండల నోడల్ ఆఫీసర్) వ్యవస్థను తెచ్చారు. వీరు ఎంఈఓలకు సపోర్టుగా పని చేయాలని అప్పటి విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలోని అన్ని మండలాలకు ఇన్‌చార్జ్ ఎంఈఓలే దిక్కయ్యారు. ఒక్కొక్కరికి ఐదారు మండలాల బాధ్యతలు అప్పగించారు. రెండేళ్ల క్రితం సీనియర్ జీహెచ్‌ఎంలకు ఎంఈఓ బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులు భావించారు. అప్పట్లో చాలా మంది ఆసక్తి చూపలేదు. దీంతో ఎంఎన్‌ఓలకు బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి వారే ఆ పదవుల్లో ఉన్నారు.
కొత్త వారికి బాధ్యలు ఇవ్వడంపై..
మూడేళ్ల క్రితం ఎక్కువ సీనియారిటీ ఉన్న గెజిటెడ్ హెచ్‌ఎంలను మండల నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. ఆ సమయంలో కొందరు విముఖత చూపడతంతో విల్లింగ్ ఉన్న వారికి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత సరిపడా ఎంఈఓలు లేక సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో నోడల్ ఆఫీసర్లకే పూర్తిస్థాయి ఎంఈఓలుగా బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ మళ్లీ ఉత్తర్వులు ఇచ్చింది. రెండేళ్లుగా వీరే బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే నోడల్ ఆఫీసర్ల కంటే సీనియారిటీ ఉన్న హెచ్‌ఎంలు తమకు ఎంఈఓల బాధ్యతలు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. కొంత కాలంగా విద్యాశాఖ కమిషనర్ తలుపు తడుతూ వస్తున్నారు. వీరికి కొందరు ఉపాధ్యాయ సంఘ నాయకులు అండగా నిలుస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో విద్యాశాఖ కమిషనర్ సీనియారిటీ ప్రాతిపదికన ఎంఈలను నియమించాలని ఆర్‌జేడీకి సూచించడం.. ఆ వెంటనే జూనియర్లు ఎంఈఓలుగా ఉన్న మండలాల్లో సీనియర్లకు బాధ్యతలు అప్పగించాలని ఆర్‌జేడీ.. డీఈఓకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం జిల్లాలోని ఆరు మండలాలు(పరిగి, ధారూరు, మర్పల్లి, యాలాల, మోమిన్‌పేట, కోట్‌పల్లి) ఎంఈఓలను మార్చి కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు. ఇది వివాదంగా మారింది.
గతంలో సీనియర్ జీహెచ్‌ఎంలు మండల నోడల్ అఽధికారుల బాధ్యతలు వద్దన్నారు. వారి తర్వాత సీనియారిటీ ఉన్న వారికి బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజుల తర్వాత విద్యాశాఖ వారినే ఎంఈఓలుగా కంటిన్యూ చేసింది. నాడు వద్దన్న వారే నేడు కావాలంటూ ఉన్నతాధికారులను సంప్రదించడంతో గందరగోళం నెలకొంది. సాధారణంగా గెజిటెడ్ హెచ్‌ఎం జోనల్ పోస్టు కాగా.. నోడల్ ఆఫీసర్ నియామక సమయంలో జోనల్ సీనియారిటీ చూడకుండా మండల సీనియారిటీ చూసి వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం ఇప్పుడు మరో వివాదానికి దారి తీసింది. జిల్లాలో ఒక్కరంటే ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంఈఓ లేరు. మొత్తం ఇన్‌చార్‌ుజ్జలే ఉన్నారు. ప్రస్తుతం వారిలోనూ సీనియారిటీ వివాదం తలెత్తి విద్యాశాఖను కుదిపేస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. ఎంఈఓలుగా ఉన్నవారు తప్పులు చేయడంతోనే బాధ్యతల నుంచి తప్పించారని కొందరు ఉపాధ్యాయులు ప్రచారం చేస్తుండటం.. అదే విషయం పత్రికల్లో రావడం, సోషల్ మిడిలో వైరల్‌గా మారడం మరింత గందరగోళంగా మారింది.
గందరగోళంగా మారిన ఎంఈఓల మార్పు
జూనియర్లు ఉన్న చోట మార్చి సీనియర్లకు అవకాశం
నాడు వద్దన్న సీనియర్ జీహెచ్‌ఎంలు
నేడు కావాలని పట్టు
కమిషనరేట్‌లో ఫిర్యాదులు
జోనల్ పోస్టుకు మండల సీనియారిటీ చూడటంపై విమర్శలు
మొత్తం ఇన్‌చార్జ్ ఎంఈఓలే


