కల సాకారం | - | Sakshi
Sakshi News home page

కల సాకారం

Feb 28 2026 8:44 AM | Updated on Feb 28 2026 8:44 AM

కల సా

కల సాకారం

నవాంద్గిలో నిలిచిన హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు

ప్రయాణించిన ఎంపీ కొండా, ఎమ్మెల్యే బీఎంఆర్‌

తాండూరు టౌన్‌/బషీరాబాద్‌: రెండున్నరేళ్ల కృషి ఫలితంగా నేడు నవాంద్గి (బషీరాబాద్‌) రైల్వే స్టేషన్‌లో హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ను నిలపగలిగామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు రవాణా వ్యవస్థ సులభతరం కావాలనే తన కల నెరవేరిందన్నారు. శుక్రవారం నావంద్గీ రైల్వే స్టేషన్‌లో హుబ్లీ రైలుకు స్వాగతం పలికి పూలు చేశారు. అనంతరం జెండాఊరి ప్రారంభించారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డితో కలిసి తాండూరుకు ప్రయాణించారు. ఈ సందర్భంగా బషీరాబాద్‌, తాండూరులో మాట్లాడారు. నవాంద్గి నుంచి తాండూరుకు రైల్వే మార్గం చాలా తక్కువ కిలోమీటర్లు ఉంటుందని, రైల్వే నిబంధన ప్రకారం ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆపాల్సిన అవసరం లేదని.. తప్పుడు సర్వే రిపోర్టు రైల్వే ఉన్నతాధికారులకు వెళ్లిందన్నారు. దీంతో నవాంద్గిలో రైలు నిలిపేందుకు వారు నిరాకరించారన్నారు. అయితే ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం దీనిపై రీసర్వే చేయించి, రైల్వే శాఖ కిందిస్థాయి అధికారుల నుంచి జీఎం వరకు వినతిపత్రాలను అందజేశానన్నారు. అలాగే రైల్వే శాఖ మంత్రి, సహాయ మంత్రుల సహకారం కూడా కోరానన్నారు. ఎట్టకేలకు రెండున్నరేళ్ల తర్వాత తన కృషి ఫలించిందన్నారు. నవాంద్గిలో హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిచిందన్నారు. దీంతో బషీరాబాద్‌ ప్రాంతం నుంచి తాండూరుకు వెళ్లేందుకు తక్కువ సమయం పడుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలు రైలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు ఏడు ప్రాంతాల్లో రైళ్లు నిలపాలని తాను చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. మరో మూడు చోట్ల రైళ్లు నిలపాలని ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అంతేకాకుండా 14 రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు కేటాయించాలని రైల్వే ఉన్నతాధికారులకు తెలిపానన్నారు. ప్రస్తుతం 4 బ్రిడ్జిలు మంజూరై, అందులో రెండింటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. అమృత్‌ పథకంలో భాగంగా తాండూరు, వికారాబాద్‌లలో ఎయిర్‌పోర్టు తరహాలో రైల్వే స్టేషన్లు తీర్చిదిద్దుతున్నారన్నారు. వికారాబాద్‌లో ఎన్‌సీసీ సెంటర్‌ను కూడా తీసుకొచ్చానని, అలాగే ఒక స్పోర్ట్స్‌ స్టేడియం నిర్మాణం కోసం నిధులు వచ్చేలా చూస్తానన్నారు. ఇందుకు కావాల్సిన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. పార్టీలకతీతంగా అందరం కలిసి కృషి చేద్దామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ.. నావంద్గీలో ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో చొరవ చూపించారని పేర్కొన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి చొరవ హర్షణీయమన్నారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. బీజేపీ నాయకులు బాలేశ్వర్‌ గుప్తా, రమేష్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు అజయ్‌ ప్రసాద్‌ వారితో పాటు రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా తాండూరు బీజేపీ నాయకులు లలిత, కృష్ణముదిరాజ్‌, నాగారం మల్లేశం, కిరణ్‌, బొప్పి శ్రీహరి, ఇందూర్‌ రాములు తదితరులు ఎంపీ, ఎమ్మెల్యేను తాండూరులో ఘనంగా సన్మానించారు. బషీరాబాద్‌ కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటేష్‌ మహారాజ్‌, ఏఎంసీ చైర్మన్‌ మాధవరెడ్డి, ఆత్మ చైర్మన్‌ శంకర్‌ రెడ్డి, మాజీ డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రవీందర్‌ గౌడ్‌, మాజీ జడ్పీటీసీ రాకేష్‌ ముహారాజ్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ వెంకట్‌ రాంరెడ్డి, నాయకులు రాములు నాయక్‌, బాల్‌ రెడ్డి, మల్హారి రాజు, డాక్టర్‌ యజరాం జ్యోషి, ప్రశాంత్‌, జగదీష్‌, రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు జయరామ్‌ జోషి తదితరులు పాల్గొన్నారు.

కల సాకారం1
1/1

కల సాకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement