ఓటుదొడుకులు
ఖాతా తెరవని ‘కారు’
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ఓట్లలో వ్యత్యాసం వస్తుంది.. ఇది అభ్యర్థులతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడి ఉంటుంది. పాలన, హామీల అమలు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుని ఓటర్లు తమ ప్రయోజనాలను కాపాడే పార్టీల వైపు మొగ్గు చూపుతారు. జిల్లాలో మూడు ప్రధాన పార్టీలు ఓటింగ్ విషయంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
వికారాబాద్: గడిచిన రెండేళ్లలో పార్టీ గుర్తులపై మూడు ఎన్నికలు జరగ్గా ఓటింగ్ సరళి, ఆయా ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2023 చివరలో ప్రారంభమై ఇటీవలి మున్సిపల్ ఎన్నికల వరకు తొలుత అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు, తాజాగా మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై నిర్వహించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా నిర్వహించారు. పార్టీ గుర్తులపై నిర్వహించిన మూడు ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మాత్రమే తన ఓటు బ్యాంక్‌ను కాపాడుకుంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఓటింగ్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ తారాజువ్వను తలపిస్తూ దూసుకుపోగా మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది. బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోరాట పఠిమను కనబర్చగా పార్లమెంట్ ఎన్నికల్లో చేతులెత్తేశారు.
కమలం.. పది శాతానికే పరిమితం
గడిచిన రెండేళ్లలో బీజేపీ ఓటింగ్ ఒడిదుడుకులకు తీవ్రంగా లోనైనట్టు ఆయా ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన ఓట్లను పరిశీలిస్తే తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో తారాజువ్వలా దూసుకుపోయిన ఆ పార్టీ ఓటింగ్ అటు అసెంబ్లీ ఎన్నికలు, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో చతికిల పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో సుమారు 33 శాతం ఓట్లు ఆ పార్టీ సాధించింది. 6,77,329 ఓట్లు పోలవగా కమలం పార్టీకి 2,11,311 ఓట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో తాండూరు, పరిగిలో కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు సాధించగా, కొడంగల్, వికారాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో 7,39,414 ఓట్లు పోలవగా కాషాయ పార్టీ 31,800 ఓట్లతో ఐదు శాతానికి పరిమితమైంది. మున్సిపల్ ఎన్నికల్లో కాస్త కోలుకున్నప్పటికీ పదిశాతం దాటలేకపోయింది. నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 1,22,359 ఓట్లు పోలవగా ఇందులో బీజేపీకి 12,091 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
అధికార కాంగ్రెస్ మాత్రం రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని వరుస విజయాలు నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాలో బరిలోకి దిగిన కాంగ్రెస్ జిల్లాలో పూర్తిస్థాయి ఆధిక్యతను కనబరిచింది. నాలుగు నియోజకవర్గాల్లో 7,39,414 ఓట్లు పోలవగా 3,76,752 అంటే 52 శాతానికి పైగా ఓట్లు సాధించిన హస్తం నాలుగు నియోజకవర్గాల్లో విజయ బావుటా ఎగురవేసింది. పార్లమెంటు ఎన్నికల్లో జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెజార్టీ తగ్గినా ఆధిపత్యాన్ని కనబరిచింది. పరిగి, తాండూరులో బీజేపీకి మెజార్టీ రాగా వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిక మెజార్టీ సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లోనూ తన ఆదిపత్యాన్ని నిలుపుకొంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 1,22,359 ఓట్లు పోలవగా ఆ పార్టీ 51,899 ఓట్లు సాధించి నాలుగు మున్సిపాలిటీల్లో పాగా వేసింది.
నిలకడ ప్రదర్శించలేకపోతున్న ప్రధాన పార్టీలు
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా .. అసెంబ్లీ, మున్సిపల్ పోరులో చతికిల
పార్లమెంట్ ఎలక్షన్‌లో పాతాళానికి పడిన బీఆర్‌ఎస్.. అసెంబ్లీ, పురపోరులో మెరుగైన ప్రదర్శన
నిలకడగా అధికార పార్టీ
మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలు, అసెంబ్లీ స్థానాలు కోల్పోయినప్పటికీ ఆ పార్టీ పోరాఠ పఠిమను కనబరిచింది. అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీనే ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం జిల్లాలో ఆ పార్టీ పది శాతం ఓట్లు కూడా సాధించలేకపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు నియోజకవరగాల్లో కలిపి 6,77,329 ఓట్లు పోలవగా కారకు గుర్తుకు 63,993 ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7,39,414 ఓట్లలో 3,01,010 ఓట్లు అంటే 40 శాతానికి పైగా ఓట్లు సాధించినప్పటికీ జిల్లా ఖాతా తెరవలేకపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 1,22,359 ఓట్లు పోలవగా ఇందులో బీఆర్‌ఎస్ 42,129 ఓట్లు సాధించింది. 30 శాతానికి పైగా ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చిప్పటికీ ఒక్క మున్సిపాలిటీని దక్కించుకోలేక పోయింది.


