కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ బదిలీ

Feb 27 2026 10:49 AM | Updated on Feb 27 2026 10:49 AM

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ బదిలీ

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ బదిలీ

వికారాబాద్‌: జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం చేపట్టిన ఐఏఎస్‌ల సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన్ను నారాయణ్‌పేట్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన కలెక్టర్‌గా 2019 బ్యాచ్‌కు చెందిన ఆసిఫాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారికి పోస్టింగ్‌ ఇచ్చారు. 2014 జూన్‌ 16న బాధ్యతలు తీసుకున్న ప్రతీక్‌జైన్‌ 20 నెలల 10 రోజులు కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. పదోన్నతిపై వచ్చిన ఆయన ఆదిలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా చివరకు పాలన సాఫీగా సాఽగించారు. లగచర్ల ఘటన ఆయన జీవితంలో మాయని మచ్చగా నిలిచింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశ్రామిక వాడ భూసేకరణలో భాగంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ వివాదస్పదంగా మారి హింసకు దారి తీసిన విషయం విదితమే. ఇందులో కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనతో అధికారుల ఆత్మవిశ్వాసం దెబ్బతినగా తదనంతర పరిణామాల్లో 50 మందికి పైగా రైతులు జైలు పాలయ్యారు.

విమర్శలు, ప్రశంసలు

కొందరు అధికారులు, నేతలు కలెక్టర్‌ అనుభవరాహిత్యం కారణంగానే లగచర్ల ఘటన జరిగిందని విమర్శించగా.. తదనంతరం ఎంతో పరిణితితో వ్యవహరించి వివాదం సద్దుమణిగేందుకు కృషి చేశారని ప్రశంసించిన వారు ఉన్నారు. చాకచక్యంగా వ్యవహరించి పారిశ్రామికవాడతో పాటు పలు అభివృద్ధి పనులకు, ప్రభుత్వ భవనాలకు భూసేకరణ సమర్థవంతంగా పూర్తి చేయగలిగారు. విద్య, వైద్యంపై దృష్టి సారించి మెరుగైన సదుపాయాలు కల్పించడంలోనూ కొంత సఫలీకృతమయ్యారు. కలెక్టరేట్‌తో పాటు పాఠశాలలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌, ఆన్‌లైన్‌ హాజరు సిస్టం ప్రారంభించారు. పర్యవేక్షణ సక్రమంగా లేక చివరకు ఆశించిన ఫలితాలు రాకపోగా లోపభూయిష్టంగా మారిందనే విమర్శలు వచ్చాయి. అధికారిక పదవులు లేని సీఎం కుటుంబసభ్యులకు, కొందరు అధికార పార్టీ నేతలకు ఎదురెళ్లి స్వాగతం పలకడం ద్వారా ప్రొటోకాల్‌ విమర్శలు ఎదుర్కొన్నారు.

అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్‌ ప్రసాద్‌

తాండూరు సబ్‌–కలెక్టర్‌గా విధులు నినర్వహిస్తున్న ఉమాశంకర్‌ ప్రసాద్‌ను జిల్లా అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరు సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ కొంతకాలంగా నారాయణ్‌పేట్‌ ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌గాను బాధ్యతలు నిర్వహించారు. రెండేళ్లుగా అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) పోస్టు ఖాళీగా ఉండటంతో సీఈఓ సుధీర్‌ ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపడుతూ వచ్చారు. ఆయన యధావిధిగా జెడ్పీ సీఈఓ పోస్టులో కొనసాగనుండగా ఉమాశంకర్‌ ప్రసాద్‌ పూర్తి స్తాయి అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

నూతన కలెక్టర్‌గా దీపక్‌ తివారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement