ప్రేమించి.. పెళ్లి చేసుకుని..
● భార్యను వదిలేసి పారిపోయిన భర్త
● అత్తవారి ఇంటి ఎదుట కోడలి ఆందోళన
దౌల్తాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఒంటరిగా వదిలేసి పరారయ్యాడో యువకుడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని గోకఫసల్‌వాద్‌కు చెందిన కొంగ బుగ్గప్ప(23), ఇదే గ్రామానికి చెందిన అశ్విని(21) ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇంట్లో ఒప్పుకోరనే కారణంతో నెల రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి, ఓ ఆలయంలో పెళ్లి చేసుకుని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తమ కూతురు కనిపించడం లేదంటూ యువతి కుటుంబ సభ్యులు స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వారం రోజుల క్రితం ఇద్దరినీ దౌల్తాబాద్ స్టేషన్‌కు పిలిపించారు. తాము ప్రేమించి, పెళ్లి చేసుకున్నామని ఇద్దరం కలిసి జీవిస్తామని అంగీకార పత్రం రాసిచ్చారు. ఇద్దరూ మేజర్లు కావడంలో పోలీసులు వారిని పంపించేశారు. రెండు రోజుల క్రితం అశ్వినితో గొడవ పడిన బుగ్గప్ప ఎక్కడికో వెళ్లిపోయాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఆందోళనకు గురైన బాధితురాలు గురువారం స్వగ్రామానికి చేరుకుని భర్త ఇంటికి వెళ్లింది. తమకేం సంబంధం లేదని చెప్పిన యువకుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక అశ్విని అక్కడే ఆందోళనకు దిగింది. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు, చేసి దర్యాప్తు చేస్తున్నారు.


