కొడంగల్‌కు సౌర సొబగులు
సోలార్ విద్యుత్‌తో డబ్బు ఆదా మిగులు కరెంటును ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మోడల్ సోలార్ విలేజ్ పథకంపై అవగాహన సదస్సు
కొడంగల్: సోలార్ విద్యుత్‌తో డబ్బు ఆదా అవుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం పట్టణ శివారులోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో మోడల్ సోలార్ విలేజ్ పథకంపై వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవీన్ మిట్టల్‌తోపాటు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ, కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి, టీజీ రెడ్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిలా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొడంగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇళ్లకు, వ్యవసాయ రంగానికి ప్రవేశపెట్టినట్లు వివరించారు. గృహాలకు, మోటార్లకు అవసరమైన విద్యుత్‌ను వినియోగించుకోవాలన్నారు. సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన కరెంటును వినియోగదారులు వాడుకున్న తర్వాత మిగులు విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇళ్లకు 2 కిలోవాట్స్(240 యూనిట్లు), వ్యవసాయ రంగానికి 7.5 కిలోవాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధంగా ప్యానల్స్‌ను బిగిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల లబ్ధిదారులు ఉచితంగా కరెంటును పొందడమే కాకుండా అమ్ముకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన విద్యుత్‌కు డబ్బు చెల్లిస్తుందన్నారు. నెల రోజుల్లో వంద శాతం అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, విద్యుత్ శాఖ డైరెక్టర్ శివాజీ, సీఈ బాలస్వామి, ఎస్‌ఈ రవిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


