సమ్మర్‌ ‘యాక్షన్‌’ ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ ‘యాక్షన్‌’ ప్లాన్‌

Feb 21 2026 8:55 AM | Updated on Feb 21 2026 8:55 AM

సమ్మర

సమ్మర్‌ ‘యాక్షన్‌’ ప్లాన్‌

ఇటు ఎల్బీనగర్‌ నుంచి బాటసింగారం వరకు అటు సంతోష్‌నగర్‌ నుంచి సాగర్‌ రోడ్డు వరకు పోల్‌ మౌంటెడ్‌ డీటీఆర్‌లు హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నంలో పీక్‌ స్థాయికి చేరిన విద్యుత్‌ డిమాండ్‌ రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా చర్యలు ‘సాక్షి’తో సరూర్‌నగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ లక్ష్మీనారాయణ

మార్చి చివరి నాటికి నాలుగు సబ్‌స్టేషన్లు ఛార్జింగ్‌

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్‌ సరఫరా కోసం మార్చి చివరి నాటికి కొత్తగా మరో నాలుగు కొత్త సబ్‌స్టేషన్లు అందుబాటులోకి తేబోతున్నాం. సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నంలో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. భవిష్యత్తు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కొహెడ, కొంగరకలాన్‌, బాగ్‌హయత్‌నగర్‌, పసుమాములలో కొత్త సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నాం. పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. మార్చి ఆఖరు లేదా ఏప్రిల్‌ మొదటి వారం నాటికి ఆయా సబ్‌స్టేషన్లను ఛార్జీ చేసి అందుబాటులోకి తీసుకురాబోతున్నాం’ అని సరూర్‌నగర్‌ ఎస్‌ఈ ఎన్‌.లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కొత్త సబ్‌స్టేషన్లతో విద్యుత్‌ సరఫరాలో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలకు శాశ్వతంగా చెక్‌ పడుతుంది. అంతేకాదు హెచ్చుతగ్గుల సమస్య ఇక ఉండదు. రెప్పపాటు కూడా కరెంట్‌ పోదు అని చెప్పారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

ఆ రెండు కారిడార్లలో ప్రత్యేక చర్యలు

ప్రధాన రహదారుల వెంట గజిబిజిగా, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ పోల్స్‌, డీటీఆర్‌లను తొలగించి, వాటి స్థానంలో 21 పోల్‌ మౌంటెడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌పార్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా ఎల్బీనగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు ఉన్న కారిడార్‌లో పది చోట్ల, ఇటు బీఎన్‌రెడ్డి నుంచి అటు నాగార్జునసాగర్‌ రహదారిలో ఆరు చోట్ల, సంతోష్‌నగర్‌ నుంచి సాహెబ్‌నగర్‌ వరకు ఐదు చోట్ల పోల్‌ మౌంటెడ్‌ డీటీఆర్‌లను ఏర్పాటు చేయనున్నాం. లైన్లు సహా స్తంభాలు, డీటీఆర్‌లన్నీ ఒకే వరుసలో అందంగా కన్పించనున్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఉండదు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండబోదు.

33 కొత్త లైన్ల ఏర్పాటు

సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా 303 అదనపు డిస్ట్రి బ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఇప్పటికే 179 డీటీఆర్‌లను ఏర్పాటు చేశాం. మిగిలిన వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం. 33 కొత్త 11కేవీ లైన్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. వీటిలో 18 లైన్ల విభజన, 15 ఇంటర్‌ లింకింగ్‌ లైన్లు వేయాలని నిర్ణయించాం. ఇటీవల నిర్వహించిన ‘కరెంటోళ్ల ప్రజాబాట’ కార్యక్రమంలో భాగంగా అనేక సమస్యలు దృష్టికి వచ్చాయి. మెజార్టీ సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించాం. ముఖ్యంగా మీర్‌పేట్‌ బస్టాప్‌లో ప్రమాదకరంగా ఉన్న డీటీఆర్‌ను తొలగించి, దాని స్థానంలో అత్యాధునిక మౌంట్‌ పోల్‌ డీటీఆర్‌ను ఏర్పాటు చేశాం.

450 మెగావాట్లకు చేరుతుందని అంచనా

సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో 24 సెక్షన్లు ఉండగా, 8 లక్షలకుపైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ఆరు లక్షల గృహ, రెండు లక్షల వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర కనెక్షన్లు ఉన్నాయి. సర్కిల్‌ సరిధిలో సెప్టెంబర్‌ 9న అత్యధికంగా 376 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. సమ్మర్‌లో 450 మెగావాట్ల డిమాండ్‌ వస్తుందని అంచనా వేసి ఆ మేరకు ముందస్తు చర్యలు చేపట్టాం. ఇప్పటికే లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, లూజ్‌ కాంటాక్ట్‌లు, డీటీఆర్‌లో ఆయిల్‌ లీకేజీలను సరిచేయడం, ఇంటిపై, చెట్ల మధ్యలో వేలాడుతున్న ఓవర్‌హెడ్‌ (ఓహెచ్‌)లైన్ల స్థానంలో ఎయిర్‌ బంచ్‌డ్‌(ఏబీ) కేబుళ్లు ఏర్పాటు చేస్తున్నాం. రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం.

సమ్మర్‌ ‘యాక్షన్‌’ ప్లాన్‌ 1
1/1

సమ్మర్‌ ‘యాక్షన్‌’ ప్లాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement