విరుల రైతు విలాపం!
ధారూరు: లాభాల సిరులు కురిపిస్తాయనే ఆశతో చేమంతి పూలు సాగు చేసిన రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆశించిన ధర లేకపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మొదట్లో కిలో రూ.100 నుంచి రూ.120 వరకు అమ్మగా, ప్రస్తుతం రూ.10 నుంచి రూ.20 పలుకుతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండల పరిధిలోని కేరెళ్లి, కొండాపూర్‌కుర్దులో సుమారు 30 ఎకరాల్లో చేమంతి సాగు చేశారు. దీపావళి వరకు సరైన దిగుబడి లేకపోవడంతో ధర బాగా పలికింది. ఆతర్వాత దిగుబడి పెరిగినా, రేట్లు అమాంతం పడిపోయాయి. రిటైల్ దుకాణాల వ్యాపారులు కిలోకు రూ.50 వరకు విక్రయిస్తున్నా, రైతుకు సఘటున రూ.15 కూడా దక్కడం లేదు. తోట సాగుకోసం ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు వచ్చిందని, ధర లేక పెట్టుబడి కూడా వచ్చేలా లేదని కర్షకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా కూలీల కొరత పూల రైతులను వేధిస్తోంది. స్థానికంగా కూలీలు అందుబాటులో లేకపోవడంతో, ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆటోలు, జీపుల్లో తీసుకురావాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. తెంపిన పూలను మార్కెట్లో విక్రయిస్తే కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంట కోసం తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో అర్థం కావడం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
పడిపోయిన చేమంతి ధరలు
కిలోకు రూ.20 కూడా దక్కని వైనం
కూలీల డబ్బులు కూడారావడం లేదని కర్షకుల ఆవేదన
పెట్టుబడికి చేసిన అప్పులపై ఆందోళన


