వీడని నిషేధం | - | Sakshi
Sakshi News home page

వీడని నిషేధం

Nov 21 2025 12:52 PM | Updated on Nov 21 2025 12:52 PM

వీడని నిషేధం

వీడని నిషేధం

ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు కుల్కచర్ల మండలం ఎర్రగోవింద్‌ తండాకు చెందిన రైతులు. ఐదారు కుటుంబాలకు చెందిన 15 మందికి ఆ గ్రామ సర్వే నంబర్‌ 361లో 20 ఎకరాల పట్టా భూమి ఉంది. పదేళ్ల క్రితం అందులోని రెండెకరాలను ప్రభుత్వం రోడ్డు కోసం తీసుకుంది. 2017లో నిర్వహించిన ఎల్‌ఆర్‌యూపీ సర్వే అనంతరం మిగిలిన 18 ఎకరాలను రెవెన్యూ అధికారులు పీఓబీ(ప్రొహిబీటేడ్‌) భూముల జాబితాలో చేర్చారు. అప్పటి నుంచి బాధితులు నిషేధిత జాబితా నుంచి తమ భూములను తీసివేయాలని తహసీల్దార్‌, ఆర్డీఓ, కలెక్టరేట్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అనేక సార్లు అర్జీలు కూడా పెట్టుకున్నారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. గురువారం కూడా కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చి పడిగాపులు కాశారు.

వికారాబాద్‌: జిల్లాలో భూ సమస్యలు కొలిక్కి రావడం లేదు. దశాబ్దాలుగా రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. ధరణి, భూ భారతి వంటి రెవెన్యూ చట్టాలు వచ్చినా అన్నదాతలకు ఒరిగిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌ 2న భూభారతి చట్టం అందుబాటులోకి వచ్చింది. 3వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. కుప్పలుతెప్పలుగా అర్జీలు వచ్చి పడ్డాయి. వాటి పరిష్కారానికి ప్రభుత్వం విధించిన గడువు కూడా ముగిసింది. కానీ సగం సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోలేదు.

వేల సంఖ్యలో పెండింగ్‌

రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారం కోసం 11,718 దరఖాస్తులు వచ్చాయి. అందులో మిస్సింగ్‌ సర్వే నంబర్లకు సంబంధించి 4,013, డీఎస్‌ పెండింగ్‌వి 1,604, సక్సేషన్‌కు సంబంధించినవి 1,654, ఎక్సెటెంట్‌ మిస్సింగ్‌వి 690 వచ్చాయి. పీఓబీకి సంబంధిచినవి 2,500 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉన్నవి మినహా మిగతా దరఖాస్తులను ఆగస్టు 14వ తేదీ నాటికి పరిష్కరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే 20 శాతం కూడా పరిష్కరించలేకపోయింది. చాలా మంది ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేశారు. పీఓబీ అర్జీలను పరిష్కరించాలని కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినా కదలిక లేదు.

చిన్నచిన్న కారణాలతో నిషేధిత జాబితాలోకి రైతుల భూములు

ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు

క్రయ విక్రయాలకు నోచుకోక ఇబ్బందులు

జిల్లాలో పెండింగ్‌ దరఖాస్తులు 2,500

భూ భారతి సదస్సుల్లో వచ్చిన అర్జీలు 11,718

సగం కూడా పరిష్కారం కాని వైనం

ఆందోళనలో అన్నదాతలు

కుస్తీ పడుతున్న యంత్రాంగం

రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు చాలా కాలంగా కుస్తీ పడుతున్నారు. ప్రధానంగా 21ఏ రిజిస్టర్‌లో పొందుపరిచిన భూ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. చిన్నచిన్న కారణాలను చూపించి వేల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. పరిగి మండలం నారాయణపూర్‌ రెవెన్యూ పరిధిలోని ఓ సర్వే నంబర్‌లో యాభై నుంచి వంద మంది రైతులకు రెండొందల ఎకరాల భూమి ఉంది. అందులో ఎకరం భూమిని ప్రభుత్వం పాఠశాలకు తీసుకుంది. అదే ఆ గ్రామానికి శాపంగా మారింది. రెండొందల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. మరో గ్రామంలో రెండు నుంచి మూడు గుంటల భూమిని రోడ్డు, గుడి కోసం తీసుకున్నారు. ఆయా సర్వే నంబర్లలోని మొత్తం భూ మిని పీఓబీ జాబితాలో చేర్చారు. దీంతో రైతు లు పొలం అమ్మాలన్నా వీలులేకుండా పోయింది. కొందరు రైతులు కూతుళ్ల వివాహాల కోసం విక్రయించేందుకు ప్రయత్నించగా నిషేధిత జాబితాలో ఉండటంతో ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పటికై నా అధికారులు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement