ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు సురక్షితం
పూడూరు/అనంతగిరి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసుకోవడం సురక్షితమని జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి అన్నారు. గురువారం పూడూరు మండలం చన్గోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందుల స్టాక్, రికార్డులను పరిశీలించారు. ప్రజలు సీజనల్ వ్యాధులబారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ఏఎన్‌ఎంలు గ్రామాల్లో పర్యటించినప్పుడు సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి మహమ్మద్ ఇక్బాల్ పారుకీ, ఎంఎల్‌పీహెచ్ శ్రీపద్మ, పార్మసిస్టు రవికుమార్, ల్యాబ్‌టెక్నీషియన్ సాజద్ అలీ, సూపర్‌వైజర్ లక్ష్మి, సిబ్బంది దాసు తదితరులు పాల్గొన్నారు.
23 పడకలతో ప్రత్యేక వార్డు
వికారాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిలో వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ కోసం 23 పడకలతో ప్రత్యేక జిరియాట్రిక్ వార్డు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి తెలిపారు. ఇందులో వృద్ధులకు సంబంధించిన అన్ని రకాల జబ్బులకు చికిత్స చేయనున్నట్లు చెప్పారు. గురువారం పీహెచ్‌సీ వైద్యులు, ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వృద్ధుల జీవనశైలి, వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి వారికి కావాల్సిన మందులు అందించడం జరుగుతుందన్నారు. వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం చేయాలని సిబ్బందికి సూచించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. మాతాశిఽశు సంరక్షణ సేవలు తప్పనిసరిగా అందించడమే కాకుండా వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి సాధారణ ప్రసవాలు జరిగే చూడాలన్నారు. ఈ నెల 21 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు వేసక్టమి పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రవీణ్, రవీంద్ర, పవిత్ర, బుచ్చిబాబు, నిరోసా, గోపాల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


