మెరుగైన విద్యుత్ సేవలకే ‘ప్రజాబాట’
అనంతగిరి: వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. గురువారం వికారాబాద్‌లోని బసంత్ ఫంక్షన్ హాల్‌లో ప్రజాబాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు వికారాబాద్ పట్టణంలో పర్యటించారు. పలు ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ లైన్లను పరిశీలించారు. ప్రజాబాటలో భాగంగా వారంలో మూడు రోజలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వచ్చే సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలుకు ఇప్పటికే రూ.55 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. విద్యుత్ బకాయిలు, సరఫరాపై తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ఎస్‌ఈ రవి ప్రసాద్, డీఈలు సంజీవ, భానుప్రసాద్, ఏవో శ్రీనివాస్ నాయక్, శ్రీనాథ్, ఏడీలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


