లొసుగులు చూసి.. భూములు కాజేసి! | - | Sakshi
Sakshi News home page

లొసుగులు చూసి.. భూములు కాజేసి!

Nov 21 2025 11:42 AM | Updated on Nov 21 2025 11:42 AM

లొసుగ

లొసుగులు చూసి.. భూములు కాజేసి!

తాయిళాలకు తలొగ్గే అధికారగణంతో రూ.10 కోట్లు విలువైన సర్కారు భూములకు కబ్జాకోరులు ఎసరు పెట్టిన ఉదంతమిది. తాండూరు పట్టణంలో దాదాపు 3.36 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వైనంకలకలం సృష్టిస్తోంది.

తాండూరు: ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిసి భూ భక్షకులుగా మారారు. రెవెన్యూ చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని అక్రమ రిజిస్ట్రేషన్‌లకు పాల్పడుతున్నారు. తాండూరు మండల రెవెన్యూ పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ స్థలాల కబ్జాలకు పాల్పడుతున్నారు. 1908 చట్టంలోని సెక్షన్‌ 22 ఏ పరిధిలోకి వస్తే ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తారు. సెక్షన్‌ 22 ఏ పరిధిలోకి వచ్చే భూములు, స్థలాల్లో రిజిస్ట్రేషన్లు నిషేధం. అయితే తాండూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో యథేచ్ఛగా భూ బదలాయింపులు చేయడం గమనార్హం.

మూడు చోట్ల అధికం

మండలంలో 38 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఆయా పల్లెల్లో శిఖ, పోరంపోగు, ఖారీకట్ట, సర్కారీ, గైరాన్‌ సర్కారీ, లావుని పట్టా, శిఖం సర్కారీ, తాక్రార్‌ లావుని పట్టాలతో ప్రభుత్వ భూములుగా గుర్తించారు. సెక్షన్‌ 22 ఏ ప్రకారం ఈ భూములను నిషేధిత జాబితాలోకి చేర్చారు. నిబంధనల ప్రకారం వాటిని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వీలు ఉండదు. మండలంలో 13,264.26 ఎకరాల భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. తాండూరు మున్సిపల్‌ పరిధిలోకి మల్‌రెడ్డిపల్లి, తాండూరు, సాయిపూర్‌ రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ మూడు గ్రామాల్లో 700 ఎకరాల వరకు సర్కారు భూములున్నాయి. అధికారులతో చేతులు కలిపి అక్రమార్కులు యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు.

బోర్డులు పెట్టి.. తొలగించి

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సర్వేనంబర్‌ 129లో 1.36 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇది సెక్షన్‌ 22 ఏ జాబితాలోకి వస్తోంది. అయితే మున్సిపల్‌, రెవెన్యూ శాఖల అధికారులు అక్రమార్కులకు సహకరించడంతో గతేడాది నలుగురి పేరిట సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. దీంతో ప్రభుత్వ భూమి కాస్త పరాధీనంలోకి వెళ్లింది. తాండూరు రెవెన్యూ పరిధిలోకి వచ్చే సర్వే నంబర్‌ 111లో 14.14 ఎకరాలు విస్తరించి ఉంది. ఇందులో కొంత భూమి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం కొనసాగుతోంది. మరో రెండెకరాల్లో భూ బకాసురులు నిర్మాణాలు చేపట్టారు. దీనిపై సబ్‌ కలెక్టర్‌కు సమాచారం అందడంతో తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్లను పనులు నిలిపివేయాలని ఆదేశించి, అడ్డుకున్నారు. పట్టణంలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. చాలా సందర్భాల్లో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల్లో బోర్డులు పెట్టి వెళ్తారు. ఒకటిరెండు రోజుల వ్యవధిలో వాటిని తొలగించి అక్రమార్కులు స్వాధీనం చేసుకుంటారు. గతంలో రెండుమూడు సార్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

కాందిశీకుల స్థలంపై ఆగ్రహం

పట్టణం నడి బొడ్డున కాందిశీకులను చెందిన 484 చదరపు గజాల స్థలాన్ని ఇటీవల ఓ వ్యాపారికి రిజిస్ట్రేషన్‌ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని తాండూరు తహసీల్దార్‌ థారాసింగ్‌ను ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి గతంలో లీజు డబ్బుల చెల్లించాలని ఇచ్చిన నోటీసులకు సంబంధించి రికార్డులను వెతుకుతున్నామని, లభించిన వెంటనే కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని తహసీల్దార్‌ పేర్కొన్నారు.

నిషేధిత స్థలాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు

సెక్షన్‌ 22ఏ నిబంధనలు పాటించని వైనం

రూ.కోట్లు కాజేస్తున్న కబ్జాకోరులు

పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు

లొసుగులు చూసి.. భూములు కాజేసి!1
1/1

లొసుగులు చూసి.. భూములు కాజేసి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement