గురువులు నిబద్ధతతో పని చేయండి
కుల్కచర్ల: ఉపాధ్యాయులు నిబద్ధతతో విధులు చేయాలని జిల్లా అబ్జర్వర్ ఆఫీసర్ పరమేశం, జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ రజినీ అన్నారు. గురువారం మండల పరిధిలోని పీరంపల్లి ప్రాథమిక పాఠశాల, కుల్కచర్ల జెడ్పీ బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాల సమాచారాన్ని అందించాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 220 పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయన్నారు. పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం నిధులు అందిస్తుందని, వాటిని జాగ్రత్తగా ఉపయోగించి సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. పీరంపల్లి పాఠశాలలో మురుగునీరు బయటకు వెళ్లేందుకు పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. జెడ్పీ బాలికల పాఠశాలలో కిటికీలను సరిచేయాలని, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జైపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.


