లావెక్కుతున్న సన్నబువ్వ | - | Sakshi
Sakshi News home page

లావెక్కుతున్న సన్నబువ్వ

Nov 21 2025 6:54 AM | Updated on Nov 21 2025 6:54 AM

లావెక్కుతున్న సన్నబువ్వ

లావెక్కుతున్న సన్నబువ్వ

వికారాబాద్‌: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ ఆరు నెలలు గడవకుముందే అభాసుపాలవుతోంది.. ప్రజల్లో నమ్మకం సడలిపోతోంది. సన్న బువ్వ ఆశలు అడియాశలవుతున్నాయి. మిల్లర్ల మాయాజాలంతో పథకం నీరుగారుతోంది. మొదటి నాలుగు నెలలు బాగానే పంపిణీ చేయగా తర్వాత నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. నవంబర్‌ నెలలో పలు రేషన్‌ దుకాణాలకు దొడ్డ బియ్యం వచ్చాయి. ఇంకొన్ని చోట్ల సన్నవి, దొడ్డువి కలిపి పంపిణీ చేశారు. మరికొన్ని చోట్ల నల్లగా మారిన బియ్యం సరఫరా చేశారు. కొన్ని షాపుల్లో మాత్రమే లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసినట్లు తెలిసింది. వికారాబాద్‌ పట్టణంలోని ఎక్కువ దుకాణాలకు దొడ్డు బియ్యం వచ్చినట్లు డీలర్లే చెబుతున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం మాత్రమే పంపిణీ చేయాలని మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా వారు పెడచెవిన పడుతున్నారు. తక్కువ ధరకు బయట కొనుగోలు చేసిన నాణ్యత లేని బియాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన సన్న వడ్లను బియ్యంగా మార్చి ఓపెన్‌ మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయించి జేబులు నింపుకొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసి నిల్వ ఉంచిన దొడ్డు బియాన్ని ఎక్కువ సార్లు పాలిష్‌ చేసి సన్న బియ్యంలో కలిపి పౌరసరఫరాల శాఖకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 588 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,81,175 రేషన్‌ కార్డులు ఉండగా ప్రతినెలా 6,235 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాయి. నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం రేషన్‌ బియ్యం పంపిణీ మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. సన్న బియ్యం కాస్తు దొడ్డుగా మారాయి. గతంలో మిల్లర్ల మాయాజాలం.. రేషన్‌ డీలర్ల చేతివాటం, అధికారుల పర్యవేక్షణ లేక రేషన్‌ బియ్యం పంపిణీ పథకం అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోందని లబ్ధిదారులు అంటున్నారు. ఆరు నెలల క్రితం సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషం పడ్డారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం కొనాల్సిన పని లేదని సంబర పడ్డారు. ఈ క్రమంలో బియ్యం ఇచ్చినన్ని రోజులూ దుకాణాలకు క్యూ కట్టారు. బ్లాక్‌ మార్కెట్‌కు ఆస్కారం లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో మళ్లీ దొడ్డు బియ్యం లబ్ధిదారులను కలవర పెడుతోంది. చాలా మంది రేషన్‌ బియ్యం వండుకోవడం లేదు. దోసె పిండి కోసం, బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. అధికారులు ప్రత్యేక చొర వ చూపితే తప్ప ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

మిల్లర్ల మాయా జాలం

ప్రతినెలా 6,235 మెట్రిక్‌ టన్నుల పంపిణీ

రేషన్‌ దుకాణాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టడంతోపాటు పేదలు కూడా సన్నబువ్వ తినాలనే ప్రభుత్వ లక్ష్యానికి మిల్లర్లు గండి కొడుతున్నారు. సన్నబియ్యంలో దొడ్డు బియ్యం కలిపి పౌర సరఫరాల శాఖకు పంపిణీ చేస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతోనే పథకం అభాసుపాలవుతోందనే అపవాదును అధికారులు మూటగట్టుకుంటున్నారు.

సన్నబియ్యంపంపిణీలో గోల్‌మాల్‌

ఒక్కో బస్తాలో ఒక్కోరకం

చాలా బ్యాగుల్లో దొడ్డు బియ్యమే దర్శనం

లబ్ధిదారుల్లో సడలుతున్న నమ్మకం

తినలేక బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయం

అధికారుల పర్యవేక్షణ కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement