ఆగిన ‘బైపాస్‌’ పనులు | - | Sakshi
Sakshi News home page

ఆగిన ‘బైపాస్‌’ పనులు

Nov 19 2025 8:31 AM | Updated on Nov 19 2025 8:31 AM

ఆగిన ‘బైపాస్‌’ పనులు

ఆగిన ‘బైపాస్‌’ పనులు

కొడంగల్‌: మహబూబ్‌గనర్‌ – చించోలి జాతీయ రహదారిపై కొడంగల్‌ చుట్టూ అర్ధ వలయాకారంలో నిర్మిస్తున్న బైపాస్‌ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ సంస్థ కాంట్రాక్ట్‌ పనులు దక్కించుకోగా.. వారు ఈ ప్రాంతానికి చెందిన కొందరికి సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారు. పనులు కొంత వరకు జరిగాయి. తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ మధ్యలోనే ఆపేసి ఇక్కడి నుంచి బిచానా ఎత్తేసి వెళ్లిపోయారు. ఈ విషయంపై సంబంధిత వ్యక్తులను వివరణ కోరగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సంస్థ సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినట్లు చెప్పారు. చేసిన పనులకు బిల్లులు కూడా వచ్చాయన్నారు. పనులు ఎందుకు ఆపారో తెలియడం లేదని పేర్కొన్నారు. జాతీయ రహదారి కావడం వల్ల పూర్తి స్థాయిలో వివరాలు చెప్పడానికి అధికారులు అందుబాటులో లేరు. ఆర్‌అండ్‌బీ అధికారుల వైఫల్యం ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ – చించోలీ (ఎమ్‌సీ) అంతర్రాష్ట్ర రహదారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా మార్చింది. రోడ్డు విస్తరణ తదితర పనులకు మొదటి విడతలో రూ.630 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి మూడేండ్లు దాటినా ఇప్పటి వరకు పూర్తి కావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

నాలుగు కిలోమీటర్ల దూరం

మహబూబ్‌నగర్‌ – చించోలీ జాతీయ రహదారిపై కొడంగల్‌ శివారులోని భారత్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి హైదరాబాద్‌ – బీజాపూర్‌ జాతీయ రహదారిని కలుపుతూ తాండూరు రోడ్డుకు కలుస్తుంది. డీపీఆర్‌లో సూచించిన అలైన్‌మెంట్‌ ప్రకారం నాలుగు కిలోమీటర్ల బైపాస్‌ రహదారిని నిర్మించాల్సి ఉంది. ఇందులో సగం వరకు కూడా పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. కాంట్రాక్టర్‌ పనులను ఆపి వెళ్లిపోవడంతో భూములు ఇచ్చిన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తరచూ ప్రమాదాలు

మహబూబ్‌నగర్‌ – చించోలీ, హైదరాబాద్‌ – బీజాపూర్‌ జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గాల్లో పోలీసులు, ఆర్టీఏ అధికారుల నిఘా కరువైంది. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ల నుంచి కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే ఈ రహదారులపై రోజూ వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. రోడ్డుకు ఇరువైపులా సిగ్నల్స్‌ లేకపోవడంతో అతివేగంగా వచ్చే వాహనాలను అదుపు చేయడం కష్టంగా మారింది. ప్రమాదాల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాహనదారులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మహబూబ్‌నగర్‌, కోస్గి, కొడంగల్‌, తాండూరు మీదుగా చించోలీ మన్నాకెళ్లి వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి వికారాబాద్‌ జిల్లా పరిధిలోని దుద్యాల్‌ వరకు ఒక మోస్తరుగా జరిగాయి. దుద్యాల నుంచి తాండూరు మీదుగా చించోలీ వరకు పనులు జరగాల్సి ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి జాతీయ రహదారి నిర్మాణ పనులు జరిగేలా చూడాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

బిచానా ఎత్తేసిన కాంట్రాక్టర్‌

సర్కారు సొమ్ము వృథా

పట్టించుకోని అధికార యంత్రాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement