రైతు సంక్షేమం పట్టదా?
పూడూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల సంక్షేమం పట్టడం లేదని, వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చేస్తున్నాయని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితారెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం మండల కేంద్రం పూడూరు, రాకంచర్ల గ్రామాల్లోని పత్తి జిన్నింగ్ మిల్లులను సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు కష్టాలు అంటే ఏంటో తెలియవన్నారు. పదేళ్ల పాలనలో ఎరువులు, విత్తనాల కొరత లేదని గుర్తు చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు రైతులను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. రైతులు పండించిన పత్తి పంట మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిబంధనలను సడలించాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరారు. రైతు రుణమాఫీ, రైతు బంధు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కేసీఆర్ హయాంలో విత్తనం వేసింది మొదలు పంట అమ్ముకునే వరకు రైతులకు అండగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, మాజీ ఎంపీపీ మల్లేశం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజారుద్దీన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు
పత్తి కొనుగోలు నిబంధనలు సడలించాలి
మాజీ మంత్రి సబితారెడ్డి


