మత్తుకు బానిస కావొద్దు
● డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: విద్యార్థులు, యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం అనంతగిరిపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్‌లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుపదార్థాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోరాదని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. జీవితం బాగుండాలంటే కష్టపడి చదువుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారని, వారికి చెడ్డపేరు తేకుండా మంచి పౌరులుగా ఎదగాలన్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు ఇచ్చే పదార్థాలను విద్యార్థులు తీసుకోరాదని తెలిపారు. దేశ భవిష్యత్ యువత పైనే ఆధారపడి ఉందని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుదామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరిచారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ నరసింహారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాల సభలు నిర్వహించండి
ప్రతి మండలంలోని ఒక పాఠశాలలో విద్యార్థుల కోసం బాల సభ నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ పట్టణ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లి డీపీఆర్‌సీలో బాల సభ నిర్వహణ, బాలల హక్కులపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20న అంతర్జాతీయ పిల్లల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల సభలు నిర్వహించాలన్నారు. ఈ సభల్లో పిల్లలకు వారి హక్కుల గురించి తెలియజేయాలని సూచించారు. సమావేశంలో డీపీఓ జయసుధ, యూనిసెఫ్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిలిప్స్, డాక్టర్ నివేదిత, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


