తాండూరు ఎంపీడీఓకు బషీరాబాద్ బాధ్యతలు
తాండూరు రూరల్: తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్‌కు బషీరాబాద్ ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఎంపీడీఓగా పని చేసిన విజయ్ కుమార్ హైదరాబాద్ హౌ సింగ్ విభాగానికి బదిలీపై వెళ్లారు. ఈ మేరకు మంగళవారం విశ్వప్రసాద్ బషీరాబాద్ ఎంపీడీ ఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఉపాధ్యాయుల కొరత తీరుస్తాం: డీఈఓ
బొంరాస్‌పేట: మండల పరిధిలోని ఎన్కేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను తీరుస్తామని డీఈఓ రేణుకాదేవి హామీ ఇచ్చినట్లు గ్రామసంఘం మహిళలు, నాయకులు తెలిపారు. తమ గ్రామం నుంచి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులను స్థానిక పాఠశాలలో చేర్పించగా 8వ తరగతి వరకు 130 మంది విద్యార్థులున్నట్లు తెలిపారు. వీరికి పాఠాలు చెప్పేందుకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు విన్నవించడంతో డీఈఓ స్పందించారన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులే ఉన్నందున, మరో ఇద్దరు రెగ్యులర్ టీచర్లతో పాటు ఇద్దరు వలంటీర్లను నియమిస్తామని చెప్పారన్నారు. త్వరలో పాశాలను సందర్శిస్తామని డీఈఓ చెప్పినట్లు ఏఏపీసీ అధ్యక్షురాలు బసమ్మ, గ్రామ సంఘం నాయకురాళ్లు బోయిని మాణెమ్మ, అనంతమ్మ, గొటికె మాణెమ్మ తెలిపారు.
అమ్మాయిలను వేధిస్తే జైలుకే
తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు రూరల్: పాఠశాల, కళాశాల వద్ద అమ్మాయిలను వేధిస్తే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. కరన్‌కోట్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం షీ టీం సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థినులను వేధింపులకు గురిచేసినా, ర్యాగింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు, బాలికల రక్షణ కోసమే ప్రభుత్వం షీటీం ఏర్పాటు చేసిందని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు ఫోన్ చేయాలని సూచించారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అనంతరం గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌పై బాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కరన్‌కోట్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్, షీటీం ఇన్‌చార్జ్ శేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టైల్స్‌వర్కర్ దారుణ హత్య
కొత్తూరు: ఇళ్లలో టైల్స్ పనులు చేస్తున్న ఓ కార్మికుడు కొత్తూరు పట్టణంలో దారుణహత్యకు గురయ్యాడు. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన శాంసుల్(30) తమ బంధువులతో కలిసి కొత్తూరులో టైల్స్ పనులు చేస్తున్నాడు. కాగా పట్టణ శివారులోని ఓ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో పనులు చేస్తూ అక్కడే పడుకున్నారు. మంగళవారం ఉదయం తోటి కార్మికులు చూసే సరికి శాంసుల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి తలపై రాయితో మోది హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం అక్కడి చేరుకున్న జాగిలం అద్దె ఇంట్లో కింద ఫ్లోర్‌లో ఉన్న తాపీమేసీ్త్ర ఇంటికి వెళ్లి ఆగిపోయింది. దీంతో అతడ్ని విచారణ చేస్తున్నట్లు సమాచారం. మృతుడి బంధువు సద్ధాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
తాండూరు ఎంపీడీఓకు బషీరాబాద్ బాధ్యతలు


