మారని తీరు!
న్యూస్‌రీల్
కట్టడి చేస్తున్నాం
బుధవారం శ్రీ 12 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఓవర్ లోడ్‌కే మెజారిటీ మైనింగ్ ఓనర్ల మొగ్గు
వికారాబాద్: మైనింగ్ ఓనర్స్ అసోసియేషన్‌లో ఓవర్ లోడ్ దుమారం రేగుతోంది. ఇటీవల జరిగిన బస్సు ఘటనలో టిప్పర్ ఓవర్‌లోడ్ కారణంగానే ప్రమాద తీవ్రత పెరిగిందనే వాదన తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇసుక, నాపరాయి, సుద్ద, గ్రానైట్, ఎర్రమట్టి తదితర మైనింగ్ ఉత్పత్తులను రవాణా చేసే ఓనర్లలో చర్చ మొదలైంది. ఇదే సమయంలో లారీ ఓనర్లలో కూడా ఓవర్‌లోడ్ అంశంపై చర్చ ప్రారంభమైంది. ఇటీవల బస్సును ఓవర్‌లోడ్‌తో దూసుకొచ్చిన టిప్పర్ ఢీ కొట్టడంతోనే 19 మంది ప్రాణాలు పోయాయి. 20 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. మైనింగ్, లారీ ఓనర్లు, ఆర్టీఏ అధికారులు, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సమావేశమైన మైనింగ్ ఓనర్లు ఓవర్‌లోడ్ అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. మెజారిటీ ఓనర్లు ఇక మీద అదనంగా వేయరాదనే నిర్ణయానికి రాగా ఒకరిద్దరు బడా ఓరర్లు ఇందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో మైనింగ్ ఓనర్స్ అసోసియేషన్ రెండుగా చీలిపోయింది. ఇటీవల చన్గొముల్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేస్తున్న లారీలపై కేసులు చేసినా తర్వాత యథావిథిగా కొనసాగిస్తున్నారు. స్థాయికి మించి రవాణా చేయరాదని స్థానిక మైనింగ్ ఓనర్లు అంగీకరించగా నాన్‌లోకల్ వారు ససేమిరా అంటున్నట్లు తెలిసింది.
నిత్యం వెయ్యి లారీల్లో రవాణా
ఓవర్‌లోడ్ మైనింగ్ ఓనర్లకు మాత్రమే లాభాలు తెచ్చిపెడుతున్నాయి. జిల్లా నుంచి రోజుకు సగటున 150 నుంచి 200 లారీల ఎర్రమట్టి, 200 నుంచి 300 లారీల నాపరాయి రవాణా చేస్తున్నారు. మరో 200 లారాల సుద్ద, ఇసుక, గ్రానైట్, మరో 200 లారీల మైనింగ్ తరలిస్తున్నారు. ప్రతి లారీ ఓవర్ లోడ్‌తో వెళుతోంది. నిబంధనల మేరకు రవాణా చేస్తే మరి కొన్ని లారీలకు కిరాయి దొరుకుతుంది. జిల్లాలో దాదాపు 2,500 లారీలు ఉండగా ఇందులో సగానికి పైగా లారీలకు కిరాయి దొరకడంలేదు. దీంతో ఓనర్లు దివాళా తీస్తున్నారు. ఓవర్ లోడ్‌కు స్వస్తి పలికితే మరో 500 నుంచి 600 లారీలకు అదనంగా పని దొరుకుతుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ పేర్కొంటోంది. ఓవర్‌లోడ్ కారణంగా ప్రమాదాల తీవ్రత పెరగడంతోపాటు రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.
అధికారులు విఫలం
నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరుగుతున్నా కట్టడి చేయడంలో ఆర్టీఏ అధికారులు విఫలమవుతున్నారు. మైనింగ్ ఓనర్ల లంచాలకు తలొగ్గి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అప్పుడప్పుడు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల పూడూరు మండలంలోని ఓ మైనింగ్ సంస్థ ఓవర్ లోడ్ తప్పదని తేల్చి చెప్పినా అధికారులు నోరు మెదపలేదు.
ఇబ్బందులు తప్పవంటున్న మరి కొందరు
మైనింగ్ అసోసియేషన్‌లో గ్రూపులు
లోకల్.. నాన్ లోకల్ మధ్య వివాదం
మీర్జాగూడ బస్సు ఘటన జరిగినా మార్పు రాని వైనం
కట్టడి చేయడంలో ఆర్టీఏ అధికారులు విఫలం
ఓవర్ లోడ్ వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఫైన్ కూడా వేస్తున్నాం. మైనింగ్ నిర్వహించే ప్రాంతాల్లో హోంగార్డులను ఏర్పాటు చేస్తున్నాం. సిబ్బంది కొరత కారణంగా పూర్తిస్థాయిలో తనిఖీలు చేయలేకపోతున్నాం. మైనింగ్ శాఖ అధికారులు సైతం చర్యలు తీసుకోవాలి.
– వెంకట్‌రెడ్డి, డీటీఓ
మారని తీరు!
మారని తీరు!


