మక్కల కొనుగోలులో గోల్‌మాల్
పరిగి: మొక్కజొన్న కొనుగోలులో కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దళారీ వ్యవస్థను అరికట్టడంతోపాటు రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాట్లు చేస్తోంది. కానీ నిర్వాహకులు రైతులను కాదని దళారులు తెచ్చిన పంటను ముందుగా సేకరిస్తున్నారు. దీంతో అన్నదాతలు నిరీక్షించాల్సి వస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో వర్షాధార పంట మొక్కజొన్నను ఎక్కువ మంది రైతులు సాగు చేశారు. పంట చేతికొచ్చి దాదాపు 20రోజులు దాటింది. ప్రభుత్వం పరిగి, కుల్కచర్ల, పూడూర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. క్వింటాలుకు మద్దతు ధర రూ.2,400 నిర్ణయించారు. అయితే కుల్కచర్లలో మాత్రమే కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. 20 రోజుల వ్యవధిలో దాదాపు 2 వేల బస్తాలు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ముందుగా దళారులు రైతుల వద్ద మొక్కజొన్న పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. గన్నీ బ్యాగులను దళారులకు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
గన్నీ బ్యాగుల కోసం..
కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రాలు ప్రారంభించిన నాటి నుంచి తిరుగుతున్నా ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దళారులు వస్తే మాత్రం వెంటనే ఇస్తున్నారని తెలిపారు. రోజూ ఒకరిద్దరు రైతులకు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలు పాటించనికేంద్రాల నిర్వాహకులు
దళారుల తెచ్చిన బస్తాలను కొనుగోలు చేస్తున్న వైనం
గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదంటున్న అన్నదాతలు


