15న ప్రత్యేక లోక్ అదాలత్
అనంతగిరి: తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో ఆయన మాట్లాడారు. కుటుంబ తగాదాలు, భార్యభర్తలు, చెక్‌బౌన్స్ తదితర కేసులు ఎక్కువ రోజులు కోర్టుల్లో పెండింగ్ ఉంచుకోకుండా.. రాజీ పడాలని అనుకున్నవారు రాజీ పడవచ్చునని పేర్కొన్నారు. తద్వారా ఇద్దరూ గెలిచినట్లే అవుతుందని, అంతే కాకుండా.. డబ్బు, సమయం ఆదా అవుతుందని చెప్పారు. కేసులు ఉండి, న్యాయవాదిని నియమించుకోలేని స్థితిలో ఉన్న పేదవారికి, న్యాయసేవ అధికార సంస్థ ద్వారా ఉచితంగా సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


