చేవెళ్ల బస్సు ప్రమాదంలో14 మంది తాండూరు వాసుల మృతి
తాండూరు: చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరులో మహా విషాదాన్ని నింపింది. సోమవారం తెల్లవారు జామున 4.40 గంటలకు తాండూరు డిపో నుంచి హైదరాబాద్‌కు బస్సు బయలు దేరింది. అలా బయలుదేరిన రెండు గంటల్లోనే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తాండూరు నియోజకవర్గానికి చెందిన 14 మంది మృత్యువాత పడ్డారు. అందులో 10 మంది మహిళలు, ముగ్గురు పురుషులు, రెండు నెలల శిశువు ఉన్నారు.
తాండూరులో ఉంటున్న పేర్కంపల్లికి చెందిన ఒకే కుంటుబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు తనూష, సాయిప్రియా, నందిని ప్రమాదంలో చనిపోయారు. పట్టణానికి చెందిన సాలేహా, రెండు నెలల శిశువు, విశ్వంబర కాలనీకి చెందిన తబస్సుమ్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన అఖిల ప్రాణాలు కోల్పోయారు. యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన లక్ష్మి, బందెప్ప దంపతులు, కరన్‌కోట్ గ్రామానికి చెందిన ముస్కాన్ బేగం మృత్యువాత పడ్డారు.
బస్సు డ్రైవర్ దస్తగిరి కూడా మృత్యువాత పడ్డారు. తాండూరు పట్టణం వాల్మీకి నగర్‌కు చెందిన వెంకటమ్మ అలియాస్ స్వాతి(22) మృతి చెందారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విగత జీవులుగా పడి ఉన్న తమవారిని చూసిన బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇక్కడికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఎక్కడ చూసినా బస్సు ప్రమాదం గురించే మాట్లాడుకోవడం కనిపించింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
