ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో ‘తల్లి’డిల్లిన ఆ కుటుంబం
తల్లి అంటే ఆ అక్కాచెల్లెళ్లకు ఎనలేని ప్రేమాభిమానాలున్నాయి. రెండో కూతురు తనూష చిన్నప్పటి నుంచి డ్రాయింగ్‌పై ఆసక్తి ఎక్కువ. ప్రకృతి చిత్రాలను గీయడం అలవాటు చేసుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచింది. మే 10వ తేదీ మదర్స్‌డే సందర్భంగా తనూష తల్లి అంబిక ముఖ చిత్రాన్ని గీసింది. బ్లాక్‌అండ్‌వైట్ ఫొటో తీస్తే ఎలా వస్తోందో అలాగే తల్లి ఫొటోను గీసి అందరినీ అబ్బుర పర్చింది. అక్క పెళ్లిలో ఆకాశమే హద్దుగా..అప్యాయతే ముద్దుగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఆ ముగ్గురూ పెళ్లిలో చేసిన నృత్యాలు, సందడి చేసిన వీడియోలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు.
తాండూరు, తాండూరు టౌన్: యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన అంబిక– ఎల్లయ్యగౌడ్ దంపతులకు అనూష, తనూష, సాయిప్రియ, నందినిలతోపాటు మురళీకృష్ణాగౌడ్ అనే కుమారుడు ఉన్నారు. ఐదుగురిని ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో కొన్నేళ్ల క్రితం ఆ కుటుంబం తాండూరుకు వచ్చింది. బస్వణ్ణ కట్ట ప్రాంతంలో ఉంటూ ఎల్లయ్యగౌడ్ టవేరా కారును కిరాయిలకు నడుపుతున్నాడు. పెద్ద కూతురు అనూషకు అక్టోబర్ 17వ తేదీన ఘనంగా పెళ్లి చేశారు. రెండో కూతురు తనూష ఎంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తోంది.
మూడో కూతురు సాయిప్రియ కోఠి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్, నాలుగో కూతు రు నందిని ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కుమారుడు మురళీకృష్ణాగౌడ్ పదో తరగతి చదువుతున్నాడు. అక్క పెళ్లిలో వారంతా సంతోషంగా గడిపారు. సోమవారం ముగ్గురు కూతుళ్లను హైదరాబాద్‌కు పంపేందుకు తండ్రి దగ్గరుండి బస్సు ఎక్కించాడు. ‘సమయానికి మందులు వేసుకో.. అమ్మను ఏమనకు.. తమ్ముడికి రోజు స్కూల్‌కు వెళ్లమని చెప్పు’అంటూ కదులుతున్న బస్సులో నుంచి ఆ ముగ్గురు కూతుళ్లు తండ్రికి టాటా చెప్పి వెళ్లారు. బై డాడీ అని చెప్పిన పిల్లలను తిరిగి విగతజీవులుగా చూస్తాననుకోలేదని...బస్సు ఎక్కకపోతే నా ముగ్గురు కూతుళ్లు బతికే వారని ఆ తండ్రి గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. మృతదేహాలను చూసి వారి స్నేహితులు ఎక్కిఎక్కి ఏడ్చారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
