అరుస్తాం.. అడ్డొస్తే కరుస్తాం!
వీధి కుక్కల బెడద ఎక్కువైంది. గుంపులుగా తిరుగుతున్నాయి. గుర్రుమంటూ అకారణంగా దాడులకు పాల్పడుతూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
కొత్తూరు: పట్టణంతో పాటు పల్లెల్లో గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయి. పదుల సంఖ్యలో స్వైరవిహారం చేస్తున్నాయి. అటుగా వెళ్తున్నవారిపై గుర్రుగా చూస్తూ.. దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో కుక్కలు కనిపిస్తే చాలు పిల్లలు, పెద్దలుజంకుతున్నారు. వీటి నియంత్రణకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. సంతతి భారీగా పెరిగింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని గూడూరు, పెంజర్ల, ఇన్ముల్‌నర్వతో పాటు మున్సిపాలిటీలోని 8,9,10వ వార్డుల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది.
ఆడుకుంటుండగా..
గూడూరు గ్రామంలో ఓ కుక్క.. అక్టోబర్ 14నఇంటి ఎదుట ఆడుకుంటున్న రిషి(08)పై దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి పెదాలకు తీవ్ర గాయమైంది. అనంతరం అదే శునకం.. మరో నలుగురిని కాటువేసింది. అదే నెల 20న నారాయణగూడ కాలనీలో.. శ్రీనివాస్ తనబైకుపై ఆర్‌కే బేకరి రోడ్డుగుండా వెళ్తుండగా.. కుక్కలు అతన్ని వెంబడించాయి. దీంతో భయంతో బైకును వేగంగా నడిపి, కిందపడి గాయాల పాలయ్యాడు. అంతకు ముందు నెల 3న కొత్తూరు పట్టణానికి చెందిన వెంకటేశ్.. వై జంక్షన్ కూడలీలోని శివాలయానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా కుక్క దాడి చేసి, గాయపర్చింది. గతేడాది ఓ విద్యార్థి మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి, పాఠశాలకు వెళ్లే క్రమంలో కుక్కలు ఎగబడి, విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. ఇలా కుక్క కాటు బాధితులు మున్సిపాలిటీలో అనేకంగా ఉన్నారు.
నియంత్రణ శూన్యం
గతంలో నగరంతో పాటు.. చాలా ప్రాంతాల్లో కుక్కల దాడిలో పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో హైకోర్టు ఆగ్రహించడంతో.. అధికారులు శునకాల నియంత్రణ,సంతాన నిరోధక టీకాలు వేసేందుకు చర్యలుచేపట్టారు. కానీ.. కొత్తూరులో మాత్రం వాటిసంఖ్యను లెక్కించడంతోనే సరిపెట్టారు. అప్పట్లో మండలం, మున్సిపాలిటీ పరిధి వార్డుల్లో సుమారు 800 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. తర్వాత వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వాటి సంఖ్య ఎన్నోరెట్లు పెరిగింది.
కుక్కకాటు బాధితులు
సంవత్సరం కేసులు
2021 301
2022 290
2023 439
2024 427
2025 388
వీధుల్లో కుక్కల స్వైరవిహారం
గుంపులుగా సంచారం..
గుర్రుమంటూ అందినచోట కాటు
అకారణంగా దాడులకుపాల్పడుతున్న వైనం


