రెండు బస్సులు ఢీ.. ప్రయాణికులు సురక్షితం
డివైడర్లను గుర్తించకపోవడంతోనే ప్రమాదం
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శేరిగూడ సమీపంలో సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్– నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై ఇందు కళాశాల వద్ద ఆదివారం స్పీడ్ బ్రెకర్లను ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదు. దీంతో వీటిని గమనించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొదిలి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కి పడి లేచారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రెండు బస్సుల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. కేసు దర్యాప్తులో ఉంది.
వరుస ప్రమాదాలు
కళాశాల వద్ద వారంలో రెండుసార్లు ఒకే స్థానంలో స్పీడ్ బ్రెకర్స్‌ను ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ లైట్లు లేకపోవడం, సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఆ స్పీడ్ బ్రెకర్లను అధికారులు తొలగించారు. తాజాగా ఆదివారం రాత్రి చిన్న స్పీడ్ బ్రెకర్లు దగ్గరదగ్గర నాలుగు వేశారు. సూచిక, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తాజా ఘటన చోటు చేసుకుంది.
‘హైటెన్షన్’తోనష్టపోతున్నాం.. ఆదుకోండి
కేంద్ర మంత్రికి విన్నవించిన రైతులు
కడ్తాల్: హైటెన్షన్ లైన్‌తో నష్టపోతున్నామని, అలైన్‌మెంట్‌ను మార్చి న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల రైతులు కోరారు. సోమవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో రైతులు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి విన్నవించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. కడ్తాల్ మండల కేంద్రంతో పాటు.. పలు గ్రామాల మీదుగా తప్పుడు అలైన్‌మెంట్‌తో సన్న చిన్న కారు రైతులకు సమాచారం ఇవ్వకుండా, వారి పంటపొలాల మీదుగా 765 కేవీ హైటెన్షన్ సోలార్ పవర్ గ్రిడ్‌లైన్‌ను తీయడం అన్యాయమని పేర్కొన్నారు. దీనికి స్పందించిన మంత్రి.. సంబంధిత అధికారులతో మాట్లాడి, న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీసీ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, రైతు నాయకులు పెంటారెడ్డి, పర్వతాలుయాదవ్, శివరామకృష్ణ, సత్యం ఉన్నారు.


