
లాభాల పూబంతి
● ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్న మహిళా రైతులు
● దీపావళికి పూలు కోసేందుకు ఏర్పాట్లు
● మార్కెట్ సౌకర్యం కల్పించాలని అభ్యర్థన
దోమ: పూల సాగుతో పలువురు రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి పర్వదినాలను దృష్టిలో ఉంచుకుని తోటలు సాగు చేశారు. సంప్రదాయ పంటల సాగుతో ఏటా నష్టాల పాలవుతున్న కొంతమంది దోమ మండల పరిధిలోని పలు గ్రామాల్లో పూలు, కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. కొన్నేళ్లుగా వాణిజ్య పంటలు వేసిన రైతులు వరుస ప్రకృతి వైపరిత్యాలతో తీవ్రంగా నష్టపోయారు. అతివృష్టి, అనావృష్టికి తోడు చీడపీడల బెడద ఎక్కువ కావడంతో ఇప్పుడిప్పుడే ఉద్యాన పంటలవైపు మళ్లుతున్నారు. వీరు సాగు చేసిన బంతి, చేమంతి పూలను దీపావళికి విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
ఎక్కడికక్కడే అమ్మకం
మండలంలోని మల్లేపల్లి, దిర్సంపల్లి, దాదాపూర్, బొంపల్లి తదితర గ్రామాల రైతులు బంతిపూలు, కూరగాయల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. పరిగి పట్టణంతో పాటు హైదరాబాద్ నగరానికి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం రాయితీపై నారు సరఫరా చేయడంతో పాటు మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
దూర భారంతో ఇబ్బందులు
సాగు చేసిన బంతి పూలను పరిగి, హైదరాబాద్, షాద్‌నగర్ తీసుకెళ్లి విక్రయిస్తున్నాం. దూర భారంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సీజన్‌లో ధర పలికినా పండుగలు ముగిసిన తర్వాత కొనుగోళ్లు ఉండవు. స్థానికంగా మార్కెట్ వసతి కల్పిస్తే ఖర్చు తగ్గుతుంది. – డి.పద్మమ్మ, మల్లేపల్లి

లాభాల పూబంతి